సుస్తీ చేస్తే అంతే..

ABN , First Publish Date - 2020-03-31T09:15:30+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో జిల్లాలో సాధారణ వైద్య సేవలకు తీవ్ర

సుస్తీ చేస్తే అంతే..

సర్కారు దవాఖానాల్లో సాధారణ వైద్య సేవలు బంద్‌

మూసివేసిన ప్రైవేటు ఆస్పత్రులు

మెడికల్‌ షాపుల్లో మందులతోనే తాత్కాలిక ఉపశమనం


గుంటూరు (సంగడిగుంట), మార్చి 30: కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో జిల్లాలో సాధారణ వైద్య సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రితో పాటు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లోను వైద్యులు చికిత్సను అందించడం లేదు. కనీసం గర్భిణులు, చిన్న పిల్లలకు సైతం చికిత్సలు లభించడం లేదు. ఎవరైనా షుగర్‌, బీపీలు పెరిగాయని వెళితే పాత మందులు వాడుకోమని సమాధానం తప్ప చెయ్యిపట్టి చూసే నాథుడు లేడు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి మొత్తం మీద సోమవారం నాడు కేవలం 30మంది రోగులు మాత్రమే చికిత్సలు పొందారు. కారణం వైద్యులు రావడం లేదు. కేవలం కాన్పుల వార్డులో మాత్రమే చికిత్స చేస్తున్నారు. ఛాతీ నొప్పితో వచ్చిన వారికి ఈసీజీ నిరాకరిస్తున్నారు. మూకుమ్మడి సెలవులకు కూడా వెళ్ళిపోతామని బెదిరించిన సంఘటనలు కూడా ఆసుపత్రి వర్గాలకు ఎదురయ్యాయి జీజీహెచ్‌కు వివిధ జిల్లాల నుంచి రిఫరల్‌ కేసులు వస్తూనే ఉన్నాయి. కేవలం అత్యవసర సేవల విభాగంలో మంచం ఇచ్చి.. బీపీ చూడడం తప్ప చేసేదేమీ లేదు. వైద్యులు ఎవ్వరు ముందుకు రావడం లేదు.


కనీసం మాస్కులు కూడా లేవు..

 ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబ్బందికి కనీసం మాస్కులు, శానిటైజర్లు కూడా ఇవ్వడం లేదని ఇలా అయితే ఎలా చికిత్సలు అందించాలని ఆవేదన చెందుతున్నారు. క్వారంటైన్‌లో ఉంటున్న విదేశీయులు, అనుమానితులకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన బృందాలకు సోమవారం వరకు కనీస సదుపాయాలు కల్పించలేదు. దీంతో వారు ఫోన్‌లోనే పరామర్శించి వెళ్ళి వచ్చామని చెబుతున్నారు. ఈ సంగతులు అన్ని ఉన్నతాధికారులకు తెలిసి కూడా మిన్నకుండిపోయారు. కారణం ప్రభుత్వం వైపునుంచి కనీస సదుపాయాలు కల్పించకపోవడమే. ఉన్నతాధికారులను దీనిపై ప్రశ్నిస్తే మౌనమే సమాధానం వస్తుంది. 


ప్రైవేటులో ఇలా..

ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆదేశాలతో ఓపీ సేవలు బంద్‌ అయ్యాయి. నర్సులు కూడా ఆస్పత్రులకు రావడం లేదు. మాకు వచ్చే తక్కువ జీతాలకు మా ప్రాణాలు పణంగా పెట్టాలా అంటూ వైద్యులను ప్రశ్నించడంతో వారు కూడా నిస్సహాయ స్థితిలో ఆసుపత్రులను మూసేశారు. ఈ తీరుతో జిల్లాలోని మెడికల్‌ షాపులే రోగుల పాలిట స్పెషాలిటీ ఆసుపత్రులు అయ్యాయి. తాత్కాలిక ఉపశమనానికి ఏదో ఒకటి మెడికల్‌ షాపుల నుంచి తెచ్చుకుని వాడుకుంటున్నారు. కొందరు ఆర్‌ఎంపీలు మాత్రం మెడికల్‌ షాపులే ఆసుపత్రులుగా చేసుకుని మందులు రాస్తున్నారు.


తగ్గిన ప్రమాదాలు

కరోనా కారణంగా ఎంత మంది మృతి చెందుతారో తెలియదు కానీ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు మాత్రం సున్నా.... జిల్లాలోని అన్ని శవాగారాల్లో కలిపి గతంలో రోజూ సరాసరిని 30కి పైగా రోడ్డు ప్రమాద మృతులకు పంచనామాలు నిర్వహించే వారు. కానీ గత వారం రోజులుగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి.

Updated Date - 2020-03-31T09:15:30+05:30 IST