Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీర్ణసంబంధ అనారోగ్యం అంటే?

ఆరోగ్యం(04/05/2021)

జీర్ణవ్యవస్థలో కీలకమైనవి కాలేయం, నాలుక, క్లోమం, థైరాయిడ్‌. ఆహారంలోని కొవ్వులు, మాంసకృత్తులు, ఖనిజలవణాలు, పీచు ఎంత ఉన్నాయనేది నాలుక గ్రహిస్తుంది. అందుకు సరిపడా జీర్ణరసాలను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఇలా కాలేయం పనితీరు మీదే జీర్ణవ్యవస్థ ఆధారపడి ఉంటుంది. 


శరీర తత్వానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోకపోతే జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయదు. ఫ్యాటీ లివర్‌, లివర్‌ సిర్రోసిస్‌ అనే సమస్యలు తలెత్తడానికి ముఖ్యకారణం శరీర తత్వానికి తగిన ఆహారనియమాలు పాటించకపోవడం. తీసుకున్న ఆహారం సక్రమంగా అరగకపోవడం వల్ల కడుపులో అనేక రకాల వాయువులు ఉత్పత్తై కడుపు ఉబ్బరం, ఛాతీ భారంగా ఉండడం, పుల్లని త్రేన్పులు లాంటి లక్షణాలు మొదలవుతాయి. పొట్టలో వాయువులు పెరగడం వల్ల వెన్ను మీద భారం పెరిగి, నడుము నొప్పి, కాళ్లు, చేతులకు జరిగే రక్తస్రావాల్లో అడ్డంకులు ఏర్పడి అరికాళ్లు, అరచేతుల మంటలు, తిమ్మిర్లు, కాళ్ల నొప్పులు, వాపులు వస్తాయి. సయాటికా, స్పాండిలైటిస్‌లకు జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడం ఓ కారణం. ఆహారం పూర్తిగా అరగకుండా రక్తంలో కలిసిపోవడం ద్వారా బిపి, వెరికోస్‌ వెయిన్స్‌ సమస్యలు వస్తాయి. మధుమేహం ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది.


జీర్ణవ్యవస్థలో రెండవ ముఖ్యమైన అవయవం... నాలుక. నాలుక మనం తీసుకునే ఆహారం గుణగణాలను గ్రహిస్తుంది. నాలుక మీద ఉండే రుచి మొగ్గలు పనిచేయని సందర్భంలో మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణవ్యవస్థ సరిగా అర్థం చేసుకోలేదు. నాలుక సున్నితత్వం సరిగా లేకపోవడం వల్ల తీసుకున్న ఆహారానికి సంబంధించిన సమాచారం కాలేయానికి చేరదు. దాంతో జీర్ణరసాలు సక్రమంగా ఉత్పత్తి జరగక అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి. నాలుక తెల్లబడడం, నాలుక మీద పూత రావడం, నాలుక ఎర్రబడడం మొదలైనవి జీర్ణసంబంధ సమస్యకు సంకేతాలు. తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా ఎక్కువసేపు పొట్టలో ఉండిపోవడం వల్ల అనేక రకాల వాయువులు ఉత్పత్తి అవుతాయి. అవి నోటి ద్వారా దుర్వాసన వెదజల్లుతూ వెలువడతాయి. ఇలా నోటి దుర్వాసన కలిగినవాళ్లకు కూడా జీర్ణసంబంధ సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కొన్ని పదార్థాలు జీర్ణం కావడం, మరికొన్ని జీర్ణం కాకపోవడం మూలంగా అలర్జీలు తలెత్తడం కూడా జీర్ణ సంబంధ సమస్యగానే భావించాలి.


కాబట్టి శరీరాన్ని అర్ధం చేసుకుని, తత్వాన్ని అనుసరించి ఆహార పదార్థాలు తీసుకోవాలి. తద్వారా జీర్ణసంబంధ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి.


-జి. శశిధర్‌

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, 

కొత్తపేట, చీరాల.Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...