గ్యాస్‌ ట్రబుల్‌

ABN , First Publish Date - 2022-05-15T06:18:31+05:30 IST

మండలంలోని ప్రజలకు గ్యాస్‌ కష్టాలు తప్పడం లేదు.

గ్యాస్‌ ట్రబుల్‌
జి.మాడుగులలోని గ్యాస్‌ గోదాము

- మండలంలో గ్యాస్‌ గోదాము ప్రారంభించినా ఫలితం శూన్యం

- కేవలం 157 కొత్త కనెక్షన్లకు మాత్రమే సిలిండర్ల సరఫరా

- సుమారు 12 వేల పాత కనెక్షన్ల వినియోగదారులకు తప్పని అవస్థలు

- పాడేరు నుంచి వారానికి ఒకసారి వచ్చే వాహనమే దిక్కు

- ఆ సమయంలో వినియోదారుడు లేకపోతే అంతే సంగతులు

- 20 కిలో మీటర్లు ప్రయాణించి సిలిండర్‌ తెచ్చుకోవలసిన దుస్థితి

- పాత కనెక్షన్లను జి.మాడుగులకు బదిలీ చేయాలని పలువురి వేడుకోలు


మండలంలోని ప్రజలకు గ్యాస్‌ కష్టాలు తప్పడం లేదు. గ్యాస్‌ గోదామును ప్రారంభించి నాలుగు నెలలు గడిచినా కేవలం కొత్త కనెక్షన్లకు తప్ప పాత కనెక్షన్ల వినియోగదారులకు ఇక్కడ గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయడం లేదు. మండలానికి వారానికి ఒకరోజు ఐటీడీఏ వాహనం ద్వారా  సిలిండర్లు సరఫరా చేస్తున్నా అవి వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. దీని వల్ల చాలా మంది వినియోగదారులు 20 కిలో మీటర్ల దూరం ప్రయాణించి పాడేరు గ్యాస్‌ గోదాముకు వెళ్లి సిలిండర్‌ తెచ్చుకోవలసిన దుస్థితి కొనసాగుతోంది. ఒకవైపు గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగడం, మరో వైపు రవాణా ఖర్చు తడిసిమోపెడు అవుతుండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

-----


జి.మాడుగుల, మే 14: మండలంలో గల 17 పంచాయతీల్లోని 435 గ్రామాల్లో సుమారు 12 వేల వరకు ఇండియన్‌ గ్యాస్‌ కనెక్షన్లు వున్నాయి. దీనికి తోడు తొమ్మిది గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాలు వున్నాయి. వీటికి ఐటీడీఏ ఆధ్వర్యంలో పాడేరులోని ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీ ద్వారా సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఈ దూరాభారాన్ని దృష్టిలో పెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వం 2018లో రూ.10 లక్షల వ్యయంతో కొత్తూరు బాలుర ఆశ్రమ పాఠశాల సమీపంలో గ్యాస్‌ గోదామును నిర్మించింది. అయితే ప్రభుత్వం మారడంతో ఈ గోదాము ప్రారంభానికి మూడేళ్లు పట్టింది. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 22న జీసీసీ చైర్మన్‌ శోభారాణి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఈ గోదామును ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించడంతో తమ కష్టాలు తీరాయని వినియోగదారులు ఆనందపడ్డారు. అయితే ఈ గోదాము పరిధిలో కొత్తగా 157 కనెక్షన్లు మంజూరు చేసి జీసీసీ ద్వారా సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. సుమారు 12 వేల పాత కనెక్షన్లకు మాత్రం పాడేరులోని ఏజెన్సీ ద్వారానే సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. మండలంలో గ్యాస్‌ గోదామును ప్రారంభించినా పాత వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. జీసీసీ అధికారులను అడిగితే ఈ పాత కనెక్షన్లను జి.మాడుగులకు బదిలీ చేస్తే గానీ సిలిండర్లు ఇవ్వలేమని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. 

పాత వినియోగదారులకు తప్పని తిప్పలు

మండలంలో ప్రారంభించిన గ్యాస్‌ గోదాము ద్వారా కేవలం 157 కొత్త కనెక్షన్లకు మాత్రమే జీసీసీ ద్వారా సిలిండర్లు సరఫరా చేస్తుండడంతో పాత వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సుమారు 12 వేల పాత కనెక్షన్లకు సంబంధించి పాడేరు నుంచి మండలానికి వారానికి ఒక రోజు ఐటీడీఏ వాహనంతో గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఈ వాహనం వచ్చే సమయానికి వినియోగదారులు లేకపోవడం, సిలిండర్లు పూర్తిస్థాయిలో అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పైగా తమ వద్దకు సిలిండర్లు తెచ్చే సిబ్బంది అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్లు అందని వినియోగదారులు పాడేరు వెళ్లి తెచ్చుకోవడం వల్ల అధిక భారమవుతోంది. ఐటీడీఏ పీవో స్పందించి పాడేరు ఏజెన్సీలో ఉన్న సుమారు 12 వేల పాత కనెక్షన్లను జి.మాడుగుల గోదాము పరిధిలోకి బదిలీ చేయాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు.


పాత కనెక్షన్లను బదిలీ చేస్తే ఇవ్వడానికి సిద్ధం 

గోదాము ప్రారంభించిన తరువాత కొత్తగా మంజూరైన 157 గ్యాస్‌ కనెక్షన్లకు సంబంధించి సిలిండర్లను సరఫరా చేస్తున్నాం. మండలంలో సుమారు 12 వేల పాత కనెక్షన్లు ఐటీడీఏ ఆధీనంలోని పాడేరు గ్యాస్‌ ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. వాటికి అక్కడ నుంచే సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఆ కనెక్షన్లను జి.మాడుగులకు బదిలీ చేస్తే సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాం. 

- బి.కొండన్న, జీసీసీ బ్రాంచి మేనేజర్‌, జి.మాడుగుల


Updated Date - 2022-05-15T06:18:31+05:30 IST