ఆలయ భూమిలో చెత్త డంపింగ్‌!

ABN , First Publish Date - 2021-09-17T04:58:51+05:30 IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గంలోని చిన్న గ్రామాల్లో సైతం డంపింగ్‌యార్డులు పూర్తయ్యాయి.

ఆలయ భూమిలో చెత్త డంపింగ్‌!
ఆలయభూమిలో చెత్త

అధ్వానంగా మారుతున్న ఆలయ పరిసరాలు

నర్సాపూర్‌లో  ఐదెకరాల స్థలం కేటాయించి నెలలు గడిచినా మొదలు కాని డంపింగ్‌యార్డు పనులు 

ఉన్నతాధికారులు ఆదేశించినా బేఖాతరు


 నర్సాపూర్‌, సెప్టెంబరు16: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గంలోని చిన్న గ్రామాల్లో సైతం డంపింగ్‌యార్డులు పూర్తయ్యాయి. పలుచోట్ల చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. మున్సిపాలిటీ అయిన నర్సాపూర్‌లో మాత్రం నేటికీ డంపింగ్‌యార్డు ఏర్పాటుకాకపోవడం గమనార్హం. చెత్తను జాతీయరహదారి పక్కన ఎంతో విలువైన ఆలయభూమిలో వేయడంతో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే నర్సాపూర్‌ మున్సిపాలిటీలో ఇప్పటికీ డంపింగ్‌యార్డు ఏర్పాటు కాలేదని పలువురు విమర్శిస్తున్నారు. చెత్తను మెదక్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారికి అతిసమీపంలో దేవదాయశాఖకు చెందిన విలువైన భూమిలోనే వేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


 నర్సాపూర్‌లో రోజూ 4 టన్నుల చెత్త సేకరణ

 నర్సాపూర్‌ డివిజన్‌లోని చాలా గ్రామపంచాయతీల్లో డంప్‌యార్డుల పూర్తి, తడిచెత్తతో సేంద్రియ ఎరువుల తయరీ ప్రక్రియ కొనసాగుతున్నది. నియోజకవర్గం మొత్తం మీద ఒకే ఒక మున్సిపాలిటీలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. నర్సాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 25వేల జనాభా ఉండగా రోజూ 4 టన్నుల చెత్తను మున్సిపల్‌ సిబ్బంది సేకరిస్తారు. సేకరించిన చెత్తను వేయడానికి నర్సాపూర్‌-మెదక్‌ ప్రధాన రోడ్డులో మూతపడ్డ చక్కెర పరిశ్రమ సమీపంలో ప్రభుత్వానికి చెందిన ఒకటిరన్నర ఎకరాల భూమిని డంపింగ్‌యార్డుగా మార్చి అక్కడ చెత్తను వేశారు. అదే స్థలంలో  తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి తడిచెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేయాలని నిర్ణయించి ఆమేరకు ప్రయత్నాలు చేశారు. పట్టణప్రగతికి వచ్చిన సమయంలో మంత్రి హరీశ్‌రావు ఈ డంపింగ్‌యార్డు స్థలాన్ని కూడా పరిశీలించారు.


స్థలం మార్పులో పెద్దల హస్తం?

 కొన్నినెలల పాటు చక్కెర పరిశ్రమ సమీపంలోని ప్రభుత్వ భూమిలోనే చెత్తను నిల్వ చేసిన అనంతరం ఇక్కడి నాయకులు, అధికారులు ఈ స్థలం సరిపోదు కనీసం ఐదు ఎకరాలు కావాలంటూ ప్రతిపాదించారు. అందుకు వివిధ అభివృద్ధి పనుల కోసం సేకరించిన  30 ఎకరాల నుంచి ఐదు ఎకరాలు డంపింగ్‌యార్డుకు కేటాయించాలని నిర్ణయించారు. అప్పటివరకు కొనసాగుతున్న ఉన్న డంపింగ్‌యార్డును తొలగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనుక కొందరు పెద్దల హస్తం ఉందన్న విమర్శలు సైతం వచ్చాయి. ఈ డంపింగ్‌యార్డు సమీపం నుంచే కొందరు బడావ్యక్తులు కొత్తగా వెంచర్‌ వేస్తున్నందున దానికి ఇబ్బంది కలగకుండానే మార్చరన్న ఆరోపణలు  వచ్చాయి. 


మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం!

డంప్‌యార్డు స్థలానికి కొత్తగా కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని సైతం త్వరితగతిన చెత్త వేయడానికి సిద్ధం చేయాల్సిన మున్సిపల్‌ అధికారులు నాలుగు నెలలు గడిచినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.  గత ఫిబ్రవరిలో డంపింగ్‌యార్డు కోసం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి భూమిపూజ కూడా చేశారు. అనంతరం కొన్నిరోజుల పాటు ఆ స్థలాన్ని ఎక్స్‌కవేటర్‌తో చదును చేసి పిచ్చిమొక్కలను తొలగించి చెత్తను తరలించే వాహనాలు వెళ్లడానికి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. కానీ డంపింగ్‌యార్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో చెత్తను ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో వేయడం లేదు.


ఆలయ భూమిలో..

 ప్రస్తుతం నర్సాపూర్‌-మెదక్‌ వెళ్లే జాతీయరహదారి పక్కన గిరిజన గురుకుల పాఠశాలకు సమీపంలోని  లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి చెందిన ఎంతో విలువైన స్థలంలో చెత్తను డంప్‌ చేస్తున్నారు. దీంతో ఆలయ భూమి  మురికికూపంగా మారింది. ఆలయ భూమిలో చెత్తను వేయొద్దని, డంప్‌యార్డును త్వరగా పూర్తిచేసి అక్కడకు తరలించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా మున్సిపల్‌ అధికారుల తీరు మారడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రోడ్డు పక్కనే చెత్తను వేస్తుండటంతో అక్కడి నుంచి వెళ్లే వాహనదారులకు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఉన్నతాధికారులు ఆదేశించినా

 డంప్‌యార్డు నిర్మాణం పనులు త్వరగా చేపట్టాలని నర్సాపూర్‌కు వచ్చిన సమయంలో కలెక్టర్‌ హరీశ్‌, అదనపు కలెక్టర్‌ ప్రీతిసింగ్‌ సైతం ఇక్కడి అధికారులకు సూచించినా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికైనా డంప్‌యార్డును త్వరగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 


త్వరలోనే వినియోగంలోకి తెస్తాం

- అశ్రిత్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ 

నర్సాపూర్‌ మున్సిపల్‌ డంపింగ్‌యార్డు నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల జాప్యం జరుగుతున్నది. త్వరలోనే టెండరు ప్రక్రియ ముగించి, పనులు చేపట్టి యార్డును వినియోగంలోకి తీసుకొస్తాం.

Updated Date - 2021-09-17T04:58:51+05:30 IST