గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2022-08-10T05:49:14+05:30 IST

జీడిపప్పు పొట్టు మూటలు మాటున రూ.కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని 8 మందిపై కేసు నమోదు చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్‌ తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.

గంజాయి స్వాధీనం

కొవ్వూరు, ఆగస్టు 9: జీడిపప్పు పొట్టు మూటలు మాటున రూ.కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని 8 మందిపై కేసు నమోదు చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్‌ తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ నెల 8న కొవ్వూరు గామన్‌ వంతెన టోల్‌గేట్‌ సమీపంలో సీఐ ఏఎల్‌ఎస్‌ రవికుమార్‌, ఎస్‌ఐ బి.దుర్గాప్రసాద్‌ సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు వస్తున్న లారీని నిలుపుదల చేసి తనిఖీచేశారు. లారీలో జీడిపప్పు పొట్టు మూటలు మాటున 31 ప్లాస్టిక్‌ సంచుల్లో  సుమారు 823.750 కిలోల గంజాయిని గుర్తించారు. ఒడిసాలోని ఖరాడ జిల్లా గండముండ మండలం పోఖరైపూర్‌ గ్రామానికి చెందిన సుకంట బిశ్వాల్‌, గంజుమ్‌ జిల్లా బెల్లగుంత మండలం అంబాబుయా గ్రామానికి చెందిన నీలంచల్‌ డోలాయ్‌లకు భువనేశ్వర్‌ దగ్గరలోని పాత్ర పుదా గ్రామానికి చెందిన సుధీర్‌ అనే లారీ డ్రైవర్‌తో 5 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. సుధీర్‌ వారం క్రితం బిశ్వాల్‌కు లారీ లోడ్‌ ఉందని మార్గం మధ్యలో గంజాయి ప్యాకెట్లు తీసుకువెళ్లాలని దానికి లారీ ఓనర్లు చింతురాజు, రమేష్‌ ఎక్కువ డబ్బులు ఇస్తారని చెప్పాడు. ఈ నెల 3న కురదాసేల్‌ వద్ద జీడిపిక్కల తొక్కలు మూటలు కట్టి లోడ్‌ చేసిన లారీని అప్పగించి, మారేడుమిల్లి దగ్గరలోని చింతూరు జంగిల్‌ రిసార్ట్‌కు వెళ్లాలని సూచించారు. దాని ప్రకారం బిశ్వాల్‌, డోలాయ్‌ లారీతో జంగిల్‌ రిసార్ట్‌ దగ్గరలోని ఫారెస్టురోడ్‌లో ఆపి చింతురాజు, రమేష్‌లకు ఫోన్‌చేయగా, లారీని అక్కడే ఉంచి, ఎవరైనా అడిగితే బ్రేక్‌డౌన్‌ అయ్యిందని చెప్పమన్నారు. 3 రోజుల తర్వాత 7వ తేదీన రాత్రి లారీ దగ్గరకు రమ్మని ఓనర్లు ఫోన్‌చేశారు. అక్కడకు వెల్లగా ముగ్గురు బైక్‌పై వచ్చి లారీని కొంచెం దూరం తీసుకెళ్లారు. అక్కడ తుప్పల్లో ఉన్న 31 ప్లాస్టిక్‌ సంచుల్లో మూటలు కట్టిన 823.750 కిలోల గంజాయిని లారీలో కనిపించకుండా లోడ్‌ చేశారు. లోడ్‌ అయిన లారీని మహారాష్ట్ర తరలిస్తుండగా కొవ్వూరు గామన్‌ వంతెన సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ బిశ్వాల్‌, డోలాయ్‌లను అరెస్టుచేసి, గంజాయితోపాటు, 2 సెల్‌ఫోన్లు, రూ.400 నగదు స్వాధీనం చేసుకుని 8 మందిపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ చెప్పారు. స్వాదీనం చేసుకున్న గంజాయి విలువ క్షేత్రస్థాయిలో రూ.24,71,250, బహిరంగ మార్కెట్‌లో రూ.కోటి వరకు ఉంటుందన్నారు. అరెస్టుయిన ఇద్దరినీ కోర్టుకు తరలించామన్నారు. సమావేశంలో కొవ్వూరు పట్టణ సీఐ ఏఎల్‌ఎస్‌ రవికుమార్‌, ఎస్‌ఐలు బి.దుర్గాప్రసాద్‌, డి.భూషణం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:49:14+05:30 IST