గ్రంథాలయ వారోత్సవాలకు కొవిడ్‌

ABN , First Publish Date - 2020-11-18T07:08:14+05:30 IST

గ్రంథాలయ వారోత్సవాలు ఈ యేడాది కోవిడ్‌ కారణంగా నిర్వహించడం లేదు.

గ్రంథాలయ వారోత్సవాలకు కొవిడ్‌

మూడేళ్లుగా వారోత్సవాల ఊసేదీ

గ్రంథాలయాల అభివృద్ధి అంతంత మాత్రమే

ఉమ్మడి జిల్లాలో 46 గ్రంథపాలకుల పోస్టులు ఖాళీ

మోత్కూరు, నవంబరు 17: గ్రంథాలయాల ప్రాముఖ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఏటా నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాలకు మూడేళ్లుగా గ్రహణం పట్టింది. 2018లో ఎన్నికల కోడ్‌, 2019లో నిధుల కొరత (బడ్జెట్‌ లేక)కారణంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించకపోగా, ఈ యేడాది కోవిడ్‌ కారణంగా నిర్వహించడం లేదు. 2019లో నిధుల కొరత కారణంగా వారోత్సవాల నిర్వహణను జిల్లా కేంద్ర గ్రంథాలయాలకే పరిమితం చేశారు. ఈ సారి అదీ లేదు. ప్రతి ఏటా నవంబరు 14 నుంచి 20 వరకు వారం రోజుల పాటు ప్రభుత్వం గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తుంది. గ్రంథాలయాలకు  రోజుకో కార్యక్రమం చొప్పున పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రంథాలయాల ప్రాముఖ్యతలను ప్రజల్లోకి తీసుకెళ్తారు. వారోత్సవాల నిర్వహణకు గ్రేడ్‌–1 ప్రభుత్వం రూ.25వేలు, గ్రేడ్‌–3 గ్రంథాలయాలకు రూ.3 వేల చొప్పున ఇస్తుంది. ఉత్సాహవంతులు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్లుగా ఉన్నచోట ప్రభుత్వ నిధులకు తోడు దాతల సహకారం తీసుకుని వెల్‌బేబీ షో, పుస్తక ప్రదర్శన, వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు, చదరంగం, క్యారమ్స్‌ లాంటి ఇండోర్‌గేమ్స్‌ నిర్వహించి ముగింపురోజున ఏదో ఓ రంగంలో పేరొందిన వ్యక్తిని ముఖ్యఅతిథిగా పిలిచి గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించి, విజేతలకు బహుమతి ప్రదానం చేసేవారు. కార్యక్రమాల ద్వారా గ్రంథాలయాల ప్రాధాన్యం, పుస్తకపఠనంతో కలిగే ప్రయోజనం ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు తెలిసేది. వారోత్సవాల నిర్వహణ కుంటుపడటంతో మూడేళ్లుగా ఆ అవకాశం లేకుండా పోయింది.


ఉమ్మడి జిల్లాలో 62 గ్రంథాలయాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 62గ్రంథాలయాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 8 మంది, యాదాద్రిభువనగిరి, సూర్యాపేట జిల్లాలో నలుగురు చొప్పు న లైబ్రేరియన్లు ఉన్నారు. మిగతా 46 లైబ్రేరియన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 46 గ్రంథాలయాలు స్వీపర్లు, పార్ట్‌టైం వర్కర్లతో నడుస్తున్నాయి. నల్లగొండ, యాదాద్రిభువనగిరి, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో గ్రేడ్‌–1 లైబ్రరరీలు కాగా దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో గ్రేడ్‌–2 లైబ్రరరీలు. మిగతా 56 గ్రేడ్‌–3 లైబ్రరరీలే. నూతనంగా ఏర్పాటైన మండలాల్లో నేటికీ గ్రంథాలయాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం స్పందించి కొత్త మండలాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న లైబ్రేరియన్‌ పోస్టులు భర్తీ చేసి గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలు కోరుతున్నారు. 


మూడేళ్లుగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం లేదు: బాలమ్మ, గ్రంథాలయ జిల్లా కార్యదర్శి

కోవిడ్‌ కారణంగా వారోత్సవాలు నిర్వహించడం లేదు: 2018, 2019 నవంబరులో ఎన్నికల కోడ్‌ కారణంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించలేదు. ఈ ఏడాది కొవిడ్‌ కారణంగా వారోత్సవాలు నిర్వహించడం లేదు. 



ఆదర్శంగా నిలుస్తున్న మోత్కూరు గ్రంథాలయం

ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా దాతల నుంచి పుస్తకాలు సేకరిస్తూ మోత్కూరు శాఖా గ్రంథాలయం జిల్లాలోనే ఆదర్శ గ్రంథాలయంగా నిలుస్తోంది. ఊరూరా గ్రంథాలయాల స్థాపనకు ఎంతో కృషి చేసిన వట్టికోట అళ్వారుస్వామి స్ఫూర్తితో మోత్కూరు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కోమటి మత్స్యగిరి ప్రభుత్వ నిధుల కోసం వేచిచూడకుండా సెప్టెంబరు 9న కళోజీ జయంతి నాటి నుంచి గ్రంథాలయానికి పుస్తకాల సేకరణ ప్రారంభించి ఇప్పటి వరకు 46 మంది దాతల నుంచి 5,430 పుస్తకాలు, వాటిని భద్రపర్చేందుకు ఐదు ర్యాక్స్‌ (అల్మారాలు) సేకరించారు. సింగిల్‌విండో చైర్మన్‌ కంచర్ల అశోక్‌రెడ్డితో పది రకాల పత్రికలకు రూ. 10వేలు వార్షిక చందా కట్టించారు. ప్రముఖ సాహితీవేత్తల, జాతీయ నాయకుల జయంతి, వర్ధంతి, తెలంగాణ భాషా, తెలుగు భాషా దినోత్సవాలు నిర్వహిస్తూ గ్రంథాలయాన్ని ప్రజల చేరువలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వినూత్న రీతిలో ఇక్కడ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, ఉన్నత విద్యా మండలి డైరెక్టర్‌ ఒంటెద్దు నర్సింహారెడ్డి చేత ప్రశంసలు అందుకున్నారు.


10 వేల పుస్తకాల సేకరణే లక్ష్యం: కోమటి మత్స్యగిరి, మోత్కూరు గ్రంథాలయ అభివృద్ధి కమిటి చైర్మన్‌

మోత్కూరు శాఖా గ్రంథాలయానికి పది వేల పుస్తకాలు సేకరించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను. ఇప్పటికి 5,430 పుస్తకాలు దాతల నుంచి సేకరించాను. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటాను. ఈ నెల 14 నుంచి గ్రంథాలయంలో నూతన సభ్యులను చేర్పిస్తున్నాం. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఉచితంగా దరఖాస్తు చేసుకునేలా దాతల సహకారంతో రెండు కంప్యూటర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నా. గ్రంథాలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు.


Updated Date - 2020-11-18T07:08:14+05:30 IST