గంజాయిపై గురి.. కొనసాగుతున్న వేట

ABN , First Publish Date - 2022-04-30T13:12:51+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆపరేషన్‌ గంజాయివేట 2.0’ పేరుతో పోలీసులు భారీగా నిషేధిత పొగాకు వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. అంతేగాక ఆ వ్యాపారులపై కఠిన చర్యలు

గంజాయిపై గురి.. కొనసాగుతున్న వేట

               - 16 మంది వ్యాపారుల బ్యాంక్‌ ఖాతాల స్తంభన


చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆపరేషన్‌ గంజాయివేట 2.0’ పేరుతో పోలీసులు భారీగా నిషేధిత పొగాకు వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. అంతేగాక ఆ వ్యాపారులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ గంజాయివేట మార్చి 28న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 2,423 మంది గంజాయి వ్యాపారులను అరెస్టు చేసి, వారి నుంచి 3,563 కేజీల గంజాయి, 197 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన గంజాయి వ్యాపారుల భరతం పట్టేలా పోలీసులు వారి బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేస్తున్నారు. ఆ మేరకు దిండుగల్‌ జిల్లా పట్టివీరన్‌పట్టిలో ముగ్గురు గంజాయి వ్యాపారులకు చెందిన 10 బ్యాంక్‌ ఖాతాలను, మదురై జిల్లాలో ఏడుగురు గంజాయి వ్యాపారులకు చెందిన 29 బ్యాంక్‌ ఖాతాలను, తేని జిల్లాలో ఆరుగురు వ్యాపారులకు చెందిన ఎనిమిది బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారు. మాదక ద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు 968 కేజీలు, రైల్వే భద్రతా దళం 734 కేజీలు, తిరువళ్లూరు జిల్లా పోలీసులు 208 కేజీలు, చెన్నై నగర పోలీసులు 186 కేజీలు, నాగపట్టినం జిల్లా పోలీసులు 168 కేజీలు, కోవై జిల్లా పోలీసులు 161 కేజీల చొప్పున గంజాయి, నిషేధిత పొగాకు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి విక్రయించేవారిపై, వాటిని అక్రమంగా తరలిస్తున్నవారిపై, రహస్యంగా దాచివుంచినవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో పోలీసుల కళ్లుగప్పి ఆన్‌లైన్‌ ద్వారా, వాట్సప్‌ ద్వారా గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. నగరంలోని ఉత్తర చెన్నై ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతుండేదని, పోలీసుల తనిఖీ అధికం కావటంతో అమ్మకాలు తగ్గాయని చెప్పారు. నిషేధిత గంజాయిని తరలించేవారు, విక్రయించేవారి బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేసి, వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Updated Date - 2022-04-30T13:12:51+05:30 IST