గంజాయి రవాణాలో.. లేడీ జోడీ!

ABN , First Publish Date - 2022-08-07T06:54:38+05:30 IST

రసాయన శాస్త్రంలో పట్టా పొందిన ఆమె రహస్య వ్యాపారంలో ఆరితేరింది. ఎలాంటి రసాయనాలతో సంబంఽధం లేకుండా మన్యంలో చాటుమాటుగా పెరిగిన గంజాయిని గమ్యస్థానాలకు చేరవేయడంలో ప్రావీణ్యం సంపాదించింది. అదే ఆమె అర్హత.. పెద్దగా చదువు లేదు. గంజాయిని అమ్మడం, కొనడంలో ఆమెది తిరిగిన చేయి. బెజవాడ నుంచి ముంబయి వరకు సరుకు రవాణా చేస్తుంది.

గంజాయి రవాణాలో.. లేడీ జోడీ!

- కొరియర్‌గా బీఎస్సీ గ్రాడ్యుయేట్‌

- గంజాయి సరఫరాదారుడితో సహజీవనం

- బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైలకు సరఫరా

- బెజవాడ మహిళతో డీల్‌

- టాస్క్‌ఫోర్స్‌ దాడితో వెలుగులోకి అసలు కథ

(ఆంధ్రజ్యోతి - విజయవాడ)

రసాయన శాస్త్రంలో పట్టా పొందిన ఆమె రహస్య వ్యాపారంలో ఆరితేరింది. ఎలాంటి రసాయనాలతో సంబంఽధం లేకుండా మన్యంలో చాటుమాటుగా పెరిగిన గంజాయిని గమ్యస్థానాలకు చేరవేయడంలో ప్రావీణ్యం సంపాదించింది. అదే ఆమె అర్హత.. పెద్దగా చదువు లేదు. గంజాయిని అమ్మడం, కొనడంలో ఆమెది తిరిగిన చేయి. బెజవాడ నుంచి ముంబయి వరకు సరుకు రవాణా చేస్తుంది. ఇది మరో మహిళ టెక్నిక్‌.. అనేకమార్లు మెట్రోపాలిటన్‌ నగరాలకు సరఫరా చేసినా ఎక్కడా పోలీసులకు చిక్కలేదు. చివరకు విజయవాడలోని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు దొరకడంతో లేడీజోడి లింక్‌లు బయటకువచ్చాయి. విశాఖపట్నం కంచరపాలేనికి చెందిన శెట్టి అరుణకుమారి బీఎస్సీ రసాయన శాస్త్రంలో ఉత్తీర్ణురాలైంది. భర్తతో విభేదాలు రావడంతో హైదరాబాద్‌కు జీవనోపాధి కోసం వెళ్లిపోయింది. అక్కడ డీ మార్ట్‌లో పనిచేస్తుండగా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన అప్పారావు అలియాస్‌ అనిల్‌తో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా విశాఖపట్నం గాజువాకకు చెందిన వంతల వంశీతో సంబంధం ఏర్పడింది. 

కొరియర్‌గా మారిన అరుణకుమారి

అనిల్‌, వంశీకి నర్సీపట్నం ప్రాంతంలో గంజాయిని పండించి, విక్రయించే ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి అరుణకుమారిని కొరియర్‌గా ఉపయోగించుకున్నారు. వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేస్తే ఒక ధర ఉంటుంది. అదే సరుకును డెలివరీ చేస్తే మరో ధర పలుకుంది. విశాఖ మన్యంలో కొనుగోలు చేయడానికి వెళ్లిన వ్యక్తి కిలో రూ.1000 విక్రయిస్తే, అదే గంజాయిని కొనుగోలుదారుడి వద్దకు సరఫరా చేస్తే రూ.3-4వేల వరకు ధర ఉంటుంది. ఇలా అరుణకుమారి ద్వారా సరఫరా చేయించి, డబ్బు గడించారు. ఈ క్రమంలో అరుణకుమారి గంజాయి సరఫరాలో ఒక భాగంగా మారిపోయింది. వంశీ జీవితంలో భాగస్వామి అయిపోయింది. అరుణకుమారితో సరుకును హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు పంపాడు. అయినా ఈ మూడు నగరాల్లో ఎక్కడా పోలీసులకు ఆమె చిక్కలేదు. 2021లో మాత్రం విశాఖ జిల్లాలోని జి.మాడుగుల పోలీసులకు వంశీ, అనిల్‌, అరుణకుమారి దొరికిపోయారు. 

బెజవాడకు వచ్చి..

సత్యనారాయణపురం ముత్యాలంపాడుకు చెందిన దుర్గ అనే మహిళపై సత్యనారాయణపురం పీఎ్‌సలో పలుకేసులు ఉన్నాయి. అనేకసార్లు ఆమె గంజాయితో దొరికిపోయింది. వృద్ధాప్యంలో ఉన్నా వ్యాపారాన్ని మాత్రం వదల్లేదు. కొద్దిరోజుల క్రితం వంశీకి గంజాయిని పంపాలని ఆర్డర్‌ ఇచ్చింది. అతడు అరుణకుమారితో సరుకును విజయవాడకు పంపాడు. ఈ సమాచారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అందింది. అప్పటికే టాస్క్‌ఫోర్స్‌లో విజయవాడ రైల్వేస్టేషన్‌లో నిఘా పెట్టారు. విశాఖ నుంచి వచ్చిన రైలులో ఒక బ్యాగ్‌తో ప్రయాణికురాలిగా అరుణకుమారి బయటకు వచ్చింది. అక్కడి నుంచి ఆమెను అనుసరించగా ముత్యాలంపాడులోని దుర్గ ఇంటికి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఈ లేడీజోడీని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అప్పారావు, వంశీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. దుర్గ విజయవాడ నగరంలో మరికొంతమంది మహిళలకు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. అంతేగాకుండా ఆమె ముంబయి, హైదరాబాద్‌లోని ఏఎస్‌ నగర్‌తోపాటు పలు ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేసిందని వెలుగులోకి వచ్చింది. ఈ మూఠాకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని హైదరాబాద్‌లోని సీసీఎ్‌సకు గానీ, టాస్క్‌ఫోర్స్‌ విభాగానికి పంపాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2022-08-07T06:54:38+05:30 IST