‘గండిపేట.. ఏమైందంటా’ కథనానికి స్పందన
ABN , First Publish Date - 2020-07-29T10:06:26+05:30 IST
గండిపేట జలాశంలో కార్లు, ఎక్స్కవేటర్లు దిగబడడంతో ‘గండిపేట.. ఏమైందంటా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం
సందర్శించిన జలమండలి అధికారులు పోలీసులకు ఫిర్యాదు
నార్సింగ్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): గండిపేట జలాశంలో కార్లు, ఎక్స్కవేటర్లు దిగబడడంతో ‘గండిపేట.. ఏమైందంటా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి జలమండలి అధికారులు స్పందించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి నార్సింగ్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారి పిల్లలు దావత్ చేసుకున్నారని, ఇందుకోసం వచ్చిన వారి వాహనాలే జలాశయం బురదలో ఇరుక్కుపోయాయని పలువురు ఆరోపిస్తున్నారు.
దీంతో ప్రస్తుతం అక్కడ బురదను తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి. వినాయక నిమజ్జనం రోజు ట్యాంక్‌బండ్ వద్ద వాడే భారీ క్రేన్లను బుధవారం తీసుకొచ్చి వాహనాలను తొలగించే ప్రయత్నం చేస్తామని సదరు వ్యక్తులు పేర్కొంటున్నారు. అయితే వర్షం భారీగా వస్తే వాహనాలు బురద నుంచి బయటకు రావని జలమండలి మేనేజర్ వెంకట్రావు పేర్కొన్నారు.
అంతా ఊబీనే..
గండిపేట జలాశయం నిర్మించి వందేళ్లు అవుతున్నా పూడిక తీసినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. దీంతో బురద భారీగానే పేరుకుంది. కొన్నిప్రాంతాల్లో పది అడుగులు, మరికొన్ని ప్రాంతాల్లో 20 నుంచి 30 అడుగుల మేర బురద, ఊబీ ఉంటుందని స్థానికులు తెలిపారు.
తాగుబోతులకు అడ్డాగా..
రంగారెడ్డి జిల్లాలోని గండిపేట, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో విస్తరించి ఉన్న గండిపేట జలాశయం తాగుబోతులకు అడ్డాగా మారింది. ప్రస్తుతం జలాశయంలో నీరు లేకపోవడంతోనే అందులో దావత్ చేసుకునేందుకు వచ్చిన వారి వాహనాలు బురదలో కూరుకుపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
లేక్ పోలీసులు ఏం చేస్తున్నట్టు?
సైబరాబాద్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ పనిచేసిన సమయంలో గండిపేట జలాశయం వద్ద హిమాయత్‌సాగర్ జలాశయం వద్ద ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరపకూడదని రెండు లేక్ పోలీ్సస్టేషన్ల ను ఏర్పాటు చేశారు. మరి ఇంత జరుగుతున్నా లేక్ పోలీసులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.