ఆశలకు గండి..!

ABN , First Publish Date - 2022-06-30T05:48:40+05:30 IST

ఆశలకు గండి..!

ఆశలకు గండి..!
బంటుమిల్లి కాల్వకు పడిన గండి

బంటుమిల్లి కాల్వకు గండిపడి నీట మునిగిన పొలాలు

సుమారు 500 ఎకరాల్లో పంటనష్టం

ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలి : కాగిత కృష్ణప్రసాద్‌


పెడన/పెడన రూరల్‌, జూన్‌ 29 : పెడన మండలం లంకలకలవగుంట, ఉరిమి గ్రామాల మధ్య బంటుమిల్లి కాల్వకు గండి పడింది. సుమారు 500 ఎకరాల్లో వెదజల్లిన పంట పొలాలు నీటమునిగాయి. మంగళవారం రాత్రి కాల్వకు గండి పడటంతో ఉరివి లంక ప్రాంతమంతా చెరువులా మారింది. తమ పంట పొలాలు మునిగిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సమాచారం తెలుసుకున్న ఆర్డీవో ఐ.కిషోర్‌, తహసీల్దార్‌ పి.మధుసూదనరావు, ఇరిగేషన్‌ శాఖాధికారులు, టీడీపీ, వైసీపీ నాయకులు గండిని, నీట మునిగిన పొలాలను పరిశీలించారు. కౌతవరం లాకులను కట్టేసి, లక్ష్మీపురం లాకులను పైకెత్తారు. నీటిమట్టం తగ్గాక గండిని పూడ్చనున్నారు. గండిని, నీటమునిగిన పొలాలను పరిశీలించిన అనంతరం టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ఇరిగేషన్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే గండి పడిందన్నారు. నీరు వదిలేటప్పుడు కాల్వగట్లు పటిష్టంగా ఉన్నాయో, లేదో చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. నీటమునిగిన పొలాల రైతులకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం చెల్లించాలని, వరి విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలని  డిమాండ్‌ చేశారు. ఆర్డీవో కిషోర్‌ మాట్లాడుతూ బంటుమిల్లి కాల్వకు పడిన గండి వల్ల 250 ఎకరాలు నీట మునిగాయన్నారు. నీరు తొలగిపోయాక పొలాలను సర్వేచేసి, నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. 



Updated Date - 2022-06-30T05:48:40+05:30 IST