జవాబుదారీతనానికి ప్రియాంక అతీతులా?: బీజేపీ సూటిప్రశ్న

ABN , First Publish Date - 2022-03-16T20:35:28+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులను..

జవాబుదారీతనానికి ప్రియాంక అతీతులా?: బీజేపీ సూటిప్రశ్న

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఆ పార్టీ ఆదేశించడంపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాత్రం ఇంకా అదే పొజిషనల్‌ ఎందుకు ఉన్నారని ప్రశ్నించింది. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా బుధవారంనాడు మాట్లాడుతూ, పార్టీలో జవాబుదారీతనానికి ప్రియాంక గాంధీ వాద్రా అతీతురాలా అని ప్రశ్నించారు..


ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రియాంకేనంటూ అంతా భావిస్తూ వచ్చారు. ఈ వాదనను బలపరచే విధంగా యూపీలో ప్రియాంక విస్తృత ప్రచారం కూడా సాగించారు. అయినప్పటికీ పార్టీ ఓటమి పాలైంది. ఈ ఓటమిని ప్రియాంక స్వయంగా అంగీకరించారు. ఈ క్రమంలోనే  పార్టీ అధిష్టానం ఐదు రాష్ట్రాల్లోని పార్టీ చీఫ్‌లను రాజీనామా చేయాలని మంగళవారంనాడు ఆదేశించింది. ఆ వెంటనే పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను పూనావాలా ప్రస్తావిస్తూ, ప్రియాంక గాంధీ వాద్రా ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ''ప్రియాంక వాద్ర మాటేమిటి? జవాబుదారీతనానికి ఆమె ఆతీతురాలా?'' అంటూ ఆయన ట్వీట్ చేశారు. పంజాబ్‌తో పాటు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ పీసీసీ చీఫ్‌లను రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది.


బీజేపీ విసుర్లు

ఎన్నికల్లో పలుమార్లు వైఫల్యాలు చవిచూసినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం రాజీనామా చేయకపోవడన్ని బీజేపీ మధ్యప్రదేశ్ తమ ట్వీట్టర్ ఖాతాలో ప్రశ్నించింది. దీనిని బట్టే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అనే విషయాన్ని చాటుతోందని పేర్కొంది. బెంగాల్ బీజేపీ నేత తథాగథ రాయ్ మరో వ్యంగ్యాస్త్రం సంధించారు. "నాలుగున్నర గంటల పోస్ట్‌మార్టం (సీడబ్ల్యూసీ సమావేశం) తర్వాత కూడా సోనియాగాంధీ పార్టీ చీఫ్‌గానే ఉన్నారు'' అని ట్వీట్ చేశారు

Updated Date - 2022-03-16T20:35:28+05:30 IST