పట్టభద్రులు ప్రలోభాలకు గురికావద్దు : గాలి వినోద్‌

ABN , First Publish Date - 2021-03-01T13:54:22+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రలోభాలకు గురికాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు ..

పట్టభద్రులు ప్రలోభాలకు గురికావద్దు : గాలి వినోద్‌

హైదరాబాద్/బర్కత్‌పుర : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రలోభాలకు గురికాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎన్నికల్లో బహుజనులను గెలిపించి తెలంగాణలో బహుజన రాజ్యస్థాపనకు నాంది పలకాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేస్తున్న ఫణీంద్ర భార్గవ్‌, ప్రొఫెసర్‌ కె.రామకృష్ణ పలు సంఘాల నేతలతో కలిసి ఆదివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానిగా పీవీ.నరసింహారావు బహుజనులకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కుమార్తె వాణీదేవి పోటీ చేసినా బహుజనులకు ఒరిగేది ఏమీలేదని ఆయన విమర్శించారు.


ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బహుజన ఉద్యోగులపై నిందలు వేసినా ఏ రాజకీయ పార్టీ కూడా నోరు మెదపలేదని, బీజేపీ, టీఆర్‌ఎస్‌, టీజేఏస్‌, సీపీఐ, సీపీఎంలు అసలు పట్టించుకోలేదని, ఈ పార్టీలకు బహుజనుల ఓట్లు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. 90 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ కులానికి చెందిన వారికే మొదటి ప్రాధాన్యత  ఇచ్చి, ఓటు వేసి అగ్రకుల పార్టీల అభ్యర్థులకు గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న గౌరీసతీష్‌, శ్రీహరి, ప్రొఫెసర్‌ రామకృష్ణ, భార్గవ్‌, ప్రొఫెసర్‌ అన్వర్‌ఖాన్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణకు నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తీన్మార్‌ మల్లన్న, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌గౌడ్‌, భారతి, మేడి రమణ తదితరులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. బహుజన అభ్యర్థులను గెలిపించడం ద్వారానే ఆత్మగౌరవ తెలంగాణను సాధించుకోగలుగుతామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పలు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T13:54:22+05:30 IST