గగనయాన్‌, ఎస్‌ఎస్‌ఎల్వీ ప్రయోగాలకు సిద్ధం

ABN , First Publish Date - 2021-01-27T05:01:17+05:30 IST

గగనయాన్‌, ఎస్‌ఎస్‌ఎల్వీ వాహకనౌక అభివృద్ధికి తమ శాస్త్రవేత్తలు ఎంతో శ్రమిస్తూ ప్రయోగాలకు సిద్ధమవుతున్నారని షార్‌ డైరెక్టర్‌ ఎ. రాజరాజన్‌ తెలిపారు.

గగనయాన్‌, ఎస్‌ఎస్‌ఎల్వీ ప్రయోగాలకు సిద్ధం
షార్‌ గణతంత్ర దినోత్సవంలో బ్రెజిల్‌ శాస్త్రవేత్తలతో షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌

గణతంత్ర దినోత్సవంలో షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌ 

శ్రీహరికోట, (సూళ్లూరుపేట) జనవరి 26 :  గగనయాన్‌, ఎస్‌ఎస్‌ఎల్వీ వాహకనౌక అభివృద్ధికి తమ శాస్త్రవేత్తలు ఎంతో శ్రమిస్తూ ప్రయోగాలకు సిద్ధమవుతున్నారని షార్‌ డైరెక్టర్‌ ఎ. రాజరాజన్‌ తెలిపారు.  శ్రీహరికోట సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రంలో మంగళవారం గణతంత్రదినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా షార్‌ డైరెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సీఐఎస్‌ఎఫ్‌ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షార్‌ ఉద్యోగులు, సిబ్బంది అంకితభావం, నిబద్ధతతో పనిచేయడం వల్లే కొవిడ్‌ను ఎదుర్కొంటూనే రెండు రాకెట్‌ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కొవిడ్‌ను అధిగమించి అంతరిక్ష కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి చివరిలో ప్రయోగించనున్న పీఎస్‌ఎల్వీ-సీ51 ద్వారా కక్ష్యలోకి తమ ఉపగ్రహాన్ని చేరవేసుకునేందుకు షార్‌కు వచ్చిన బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు ఈ గణతంత్రవేడుకలకు హాజరై మన పతాకానికి సగౌరవంగా వందనం చేశారు. కార్యక్రమంలో షార్‌ కంట్రోలర్‌ ఎన్‌, శ్రీనివాసులురెడ్డి, సీఐఎస్‌ఎఫ్‌ సీనియర్‌ కమాండెంట్‌ జితేంద్రకుమార్‌ తీవారి, ఎంఎస్‌జీ జీడీ పీ గోపీకృష్ణ, కేంద్రీయ పాఠశాల విద్యార్థులు, సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు, షార్‌ ఉద్యోగుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అలాగే శ్రీహరికోటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో వీఏఎల్‌ఎఫ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆర్‌. వెంకటరామన్‌, షార్‌ శబరీకాలనీ పాఠశాలలో జీడీ సయ్యద్‌ హమీద్‌, సూళ్లూరుపేటలోని షార్‌ కాలనీ పులికాట్‌ నగర్‌లో షార్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఎం. బద్రీనారాయణమూర్తి, డీవోఎస్‌కాలనీలో రేంజ్‌ ఆపరేషన్స్‌ డీడీ జీ. గ్రహదొరై పతాకావిష్కరణలు చేశారు.

Updated Date - 2021-01-27T05:01:17+05:30 IST