కోవిడ్-19: ప్రధానమంత్రి సహాయ నిధికి నెల జీతం విరాళమిచ్చిన గడ్కరీ

ABN , First Publish Date - 2020-03-27T13:59:30+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి కొవిడ్-19పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు సంఘీభావంగా ముందుకొస్తున్నారు...

కోవిడ్-19: ప్రధానమంత్రి సహాయ నిధికి నెల జీతం విరాళమిచ్చిన గడ్కరీ

న్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కొవిడ్-19పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు సంఘీభావంగా ముందుకొస్తున్నారు. ప్రధాన మంత్రి సహాయనిధికి తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కరోనా వైరస్‌పై ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు రావాలంటూ ఆయన ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు.  ‘‘కోవిడ్-19 సహాయక చర్యల కోసం ఒక నెల జీతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ మహమ్మారిని అరికట్టేందుకు  జరుగుతున్న పోరాటంలో భాగస్వాములయ్యేందుకు తమవంతు సాయం అందించేందుకు ముందుకు రావాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను..’’ అని గడ్కరీ పేర్కొన్నారు.


కాగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ సైతం నిన్న ప్రధానమంత్రి సహాయనిధికి, ఆంధ్ర ప్రదేశ్ సీఎం, తెలంగాణ సీఎం సహాయ నిధులకు విరాళం ప్రకటించారు. ‘‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కరోనా వైరస్‌పై పోరాటం కోసం నా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ. కోటి, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. కోటి చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకున్నాను..’’ అని సీఎం రమేశ్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. కాగా తన సొంత జిల్లా కడపకు ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రులు, డిస్పెన్సరీల్లో రోగులకు వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ పరికరాల కొనుగోలు వీటిని వినియోగించనున్నట్టు రమేశ్ తెలిపారు. కాగా తన ప్రధానమంత్రి సహాయ నిధికి తన వ్యక్తిగత విరాళంగా రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు కూడా ఆయన పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 694 మంది కరోనా వైరస్ బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కొత్తగా 88 కేసులు నమోదైనట్టు తెలిపింది. దేశంలో ఒక్కరోజే ఇన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 

Updated Date - 2020-03-27T13:59:30+05:30 IST