160 రోజుల తర్వాత తెరుచుకున్న Gaddi Annaram పండ్ల మార్కెట్

ABN , First Publish Date - 2022-03-05T18:43:01+05:30 IST

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ గేట్లు తెరుచుకున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో..

160 రోజుల తర్వాత తెరుచుకున్న Gaddi Annaram పండ్ల మార్కెట్

వ్యాపారులు, హమాలీల సంబురాలు


హైదరాబాద్ సిటీ/దిల్‌సుఖ్‌నగర్‌ : గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ గేట్లు తెరుచుకున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మార్కెట్‌ను తెరవాలంటూ మార్కెటింగ్‌ శాఖ డైరెక్టెర్‌ లక్ష్మీభాయి మెమో జారీచేశారు. మెమో పత్రాన్ని మార్కెట్‌ గేటుకు అంటించిన గడ్డిఅన్నారం మార్కెట్‌ ఉన్నత శ్రేణికార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న చిలుక నర్సింహారెడ్డి మార్కెట్‌ గేట్లను తెరచి, కమీషన్‌ ఏజెంట్లను యార్డులోపలికి అనుమతించారు. దీంతో 160 రోజులుగా మూసి ఉన్న మార్కెట్‌లోకి కమీషన్‌ ఏజెంట్లు, హమాలీలు పదుల సంఖ్యలో తరలివచ్చారు. బాణా సంచాకాల్చి సంబురాలు జరుపుకొన్నారు. దుకాణాల్లోకి వచ్చి కూర్చున్న కొందరు కమీషన్‌ ఏజెంట్లు ఆనందంతో కొందరు కన్నీటి పర్యంతమయ్యారు.  రెండు డీసీఎంలలో పుచ్చకాయ, తర్బూజ పండ్లు మార్కెట్‌లోకి చేరాయి.  


విద్యుత్‌, నీటి కనెక్షన్‌ కట్‌

ఐదున్నర నెలలుగా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ మూసి ఉండడంతో యార్డులో నీటి బిల్లులు, విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదు. దీంతో సంబంధిత శాఖల అధికారులు మార్కెట్‌ యార్డుకు విద్యుత్‌, నీటిసరఫరా నిలిపివేశారు.


రెండు చోట్ల లావాదేవీలు

కొత్తపేటలోని మార్కెట్‌లో శనివారం ఉదయం నుంచి  క్రయ విక్రయాలు నిర్వహిస్తాం. అయితే తాత్కాలికంగా విక్రయాలు జరుపుతున్న బాటసింగారంలో కూడా యథావిధిగా విక్రయాలు కొనసాగుతాయి. రైతులు తమకు అందుబాటులో ఉన్న చోట పండ్లను విక్రయించుకోవచ్చు. రెండు చోట్ల మార్కెటింగ్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచుతాం. విద్యుత్‌, నీటి బిల్లుల బకాయిలు రెండు రోజుల్లో చెల్లించి, కనెక్షన్లు పునరుద్ధరిస్తాం. - చిలుకా నర్సింహారెడ్డి, ఉన్నత శ్రేణికార్యదర్శి


నిర్మాణం పూర్తయ్యే వరకు ఇబ్బంది పెట్టొద్దు

కోర్టు తీర్పును హర్షిస్తున్నాం. ఐదున్నర నెలలుగా నష్టాలు అనుభవించిన మమ్మల్ని ఇక మీదట ఇబ్బందులకు గురిచేయకుండా ఉండాలి. మేము కోహెడకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. కోహెడలో శాశ్వత నిర్మాణాలు చేపట్టగానే తప్పకుండా అక్కడకు తరలివెళ్తాం. బాటసింగారంలో వ్యాపారం చేసేందుకు సరైన వసతులు లేవు. అధికారులు సహకరించాలి. - అప్సర్‌ఖాన్‌, కమీషన్‌ ఏజెంట్‌


తక్షణమే తెరవండి.. 

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తక్షణమే తెరవాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పండ్ల మార్కెట్‌ కమిషన్‌ ఏజెంట్లు తమ వ్యాపారాలను బాటసింగారంలోని తాత్కాలిక పండ్ల మార్కెట్‌కు తరలించేందుకు వీలుగా నెలరోజులపాటు గడ్డిఅన్నారం మార్కెట్‌ను తెరవాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలు అమలుకావడం లేదని, వ్యాపారాలను తరలించేందుకు వెళ్తే మార్కెట్‌లోకి అనుమతించడం లేదని కమీషన్‌ ఏజెంట్లు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. తమ ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని మార్కెటింగ్‌శాఖ, గడ్డిఅన్నారం మార్కెట్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులను ఎందుకు శిక్షించరాదో వివరణ తెలియజేయాలని పేర్కొన్నది. తక్షణం మార్కెట్‌ను తెరువాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని ఆదేశాలు జారీచేసింది. 

Updated Date - 2022-03-05T18:43:01+05:30 IST