పర్యాటకంగా మరింత అభివృద్ధి

ABN , First Publish Date - 2022-05-22T06:16:02+05:30 IST

రాబోయే రెండేళ్లలో పర్యాటక పరంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన విభాగం శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు.

పర్యాటకంగా మరింత అభివృద్ధి

2024లో మళ్లీ జగనే సీఎం

దిగజారుడు రాజకీయాలను టీడీపీ మానుకోవాలి

పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా 


ఓర్వకల్లు, మే 21: రాబోయే రెండేళ్లలో పర్యాటక పరంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన విభాగం శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. శనివారం ఓర్వకల్లు గ్రామ సమీపాన ఉన్న హరిత రాక్‌ గార్డెన్‌ను ఆమె సందర్శించారు. హరిత రాక్‌ గార్డెన్‌ రెస్టారెంటు శాఖ అధికారులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. రెస్టారెంటులో ఉన్న రాతివనాలను, ఇనుప వస్తువులతో తయారు చేసిన వివిధ రకాల చిహ్నాలను, రూములను మంత్రితో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి సందర్శించి పరిశీలించారు. అనంతరం రెస్టారెంటులో పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ రాతివనాలు ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.  జిల్లాల ప్రజాప్రతినిధులతో చర్చించి, ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని అన్నారు.  శ్రీశైలం, యాగంటి, అహోబిలం, మహానంది వంటి చారిత్రక పురాతన ఆలయాలతో పాటు ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌, కేతవరం ప్రాచీన రాతిచిత్రాల తదితర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ ప్రాంతాలను పర్యాటకంగానేకాక పారిశ్రామిక పరంగా కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ రామచంద్ర, డివిజన్ల మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు ఈశ్వరయ్య, కర్నూలు వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాల్లో ఉన్న పర్యాటకప్రాంతాల అభివృద్ధి గురించి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల టూరిజం అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రంగనాథగౌడు, ఎంపీపీ తిప్పన్న, తహసీల్దార్‌ శివరాముడు, సీఐ శ్రీనాథ్‌ రెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జున, టూరిజం మేనేజర్‌ మురళి, సర్పంచ్‌ తోట అనూష, ఆయా శాఖ అధికారులు, టూరిజం సిబ్బంది పాల్గొన్నారు.


ఓర్వకల్లులో మంత్రి ప్రత్యేక పూజలు


కర్నూలు పర్యటనకు వచ్చిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా ఓర్వకల్లుకు శనివారం పురోహితుడు ఫణి శశాంక శర్మ ఇంటికి వెళ్లి పూజలు చేశారు. ఆయన మంత్రిని ఆశీర్వదించారు.

Updated Date - 2022-05-22T06:16:02+05:30 IST