మానవీయ సంస్కారం

ABN , First Publish Date - 2021-05-06T07:31:19+05:30 IST

ఒక అమానవీయ వాతావరణాన్ని..

మానవీయ సంస్కారం

21 మృతదేహాలకు అంత్యక్రియలు

ముస్లిం జేఏసీతో కలిసి ఎమ్మెల్యే భూమన సేవలు

ప్రధాని కార్యాలయం నుంచి అభినందనలు


ఒక అమానవీయ వాతావరణాన్ని కరోనా సృష్టించింది. మనిషికి మనిషికి నడుమ అన్ని బంధాలనూ బదాబదలు చేసేస్తోంది. కుటుంబంలో ఒకరు కన్నుమూస్తే, కన్నీటితో అంతిమ సంస్కారం కూడా చేయలేని దుర్మార్గ కాలం దాపురించింది. వైరస్‌కన్నా తీవ్రంగా భయం వెంటాడుతోంది. ఆస్పత్రుల్లో దొరకని బెడ్‌లు, అందని ఆక్సిజన్‌, అరాకొరా వైద్యసేవలు.. ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఆస్పత్రుల్లో మరణిస్తున్న తమవారి దేహాలను వదిలేసి కుటుంబసభ్యులు వెళ్లిపోతున్నారు. అందరూ ఉండీ అనాథశవాల్లా మార్చురీ గదుల్లో కొవిడ్‌ మృతదేహాలు పేరుకుపోతున్నాయి. ఇటువంటి భౌతిక కాయాలకు మేమున్నామంటూ తిరుపతిలో ఒక ముస్లిం బృందం ముందుకొచ్చి దహనక్రియలు నిర్వహిస్తున్న విషయం ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రకటించింది. చిన్నా చితకా పనులు చేసుకుంటూనే వీరు అందిస్తున్న మానవీయ సేవ పలువురిని ప్రభావితం చేసింది. బుధవారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి స్వయంగా వీరితో కలిసి 21 కొవిడ్‌ మృతదేహాలకు అంతిమ సంస్కారం నిర్వహించారు. ఈయన మానవీయ సేవలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అభినందనలు లభించాయి.


తిరుపతి: కరోనా సోకి తిరుపతి రుయా కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తున్న వివిధ ప్రాంతాలవారు ఎందరో ఉంటున్నారు. వీళ్లలో చాలా మంది మృతదేహాలను బంధుమిత్రులు తీసుకు వెళ్లడం లేదు. తమ ప్రాంతానికి తీసుకువెళ్లడం భారీ ఖర్చుతో కూడుకున్నది కావడం, ఒకవేళ తీసుకువెళ్లినా తమ ఊళ్లో దహనక్రియలకు వ్యతిరేకత వస్తుందనే ఆందోళన, వైరస్‌ సోకుతుందనే భయం వంటివి ఇందుకు కారణాలు. ఇటువంటి మృతదేహాలు రుయా మార్చురీలో పేరుకుపోతున్నాయి. ముస్లిం యువకుల బృందం ఈ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నా బుధవారం నాటికి 21 మృతదేహాలు మిగిలిపోయాయి. ఈ విషయం తెలిసి తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి మార్చురీ దగ్గరకు చేరుకున్నారు. ఇప్పటికే 501 మృతదేహాలకు అంత్యక్రియలు స్వచ్ఛందంగా నిర్వహించిన ముస్లిం యువ బృందం సేవలను ఆయన అభినందించారు.


తనే పూనుకుని వారితో కలిసి 21 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. పూలమాలలు వేసి, సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలకు తరలించారు. రెండుసార్లు కరోనా సోకినా, 60 ఏళ్ల వయసులోనూ కరుణాకరరెడ్డి అనాథ మృతదేహాల అంత్యక్రియలు దగ్గరుండి నిర్వహించడం పట్ల పలువురు ప్రశంసించారు. ప్రజల్లో భయాలు పోగొట్టడానికి ఆయనే స్వయంగా మృతదేహాలను మోశారు. భూమన సేవలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బుధవారం అభినందన సందేశం అందింది. ప్రధాని ముఖ్యకార్యదర్శి పికె. మిశ్రా నుంచి ఈ సందేశం అందింది.


‘‘ నిన్నటి దాకా అత్యంత ఆత్మీయులుగా మనతో మన మధ్య తిరిగినవారు కరోనాతో చనిపోయినంత మాత్రాన వారి మృతదేహాలు అంటరానివిగా మారిపోతున్న తీరు నన్ను కలచివేసింది. ఇంత అమానవీయతను వైరస్‌ మన మధ్య సృష్టిస్తోంది. మృతదేహాల మీద వైరస్‌ సజీవంగా ఉండదని వైద్య శాస్త్రం చెబుతున్నా భయంతో తమవారిని అనాథలుగా వదిలేస్తున్నారు. ఇది పోగొట్టడానికే స్వయంగా నేనే అంత్యక్రియల్లో పాల్గొన్నా. ఈ సేవలు నిర్వహిస్తున్న ముస్లింజేఏసీ మిత్రులకు అభినందనలు.’’

- భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే

 

Updated Date - 2021-05-06T07:31:19+05:30 IST