నిర్మాణాలకు..నిధుల గండం

ABN , First Publish Date - 2022-06-26T05:30:00+05:30 IST

గ్రామ, వార్డు, సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌, డిజిటల్‌ లైబ్రరీలకు శాశ్వత ప్రాతిపదికన భవనాలను నిర్మిస్తామని 2020లో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది.

నిర్మాణాలకు..నిధుల గండం
బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో ఫిల్లర్స్‌ వేసి వదిలేసిన వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌

నిలిచిపోయిన ప్రభుత్వ భవనాల నిర్మాణం

చాలా వరకు పునాదుల దశలోనే..

బిల్లుల పెండింగ్‌ కూడా జాప్యానికి కారణం

తొలుత మార్చి 31 గడువు, మళ్లీ ఆగస్టు వరకు పొడిగింపు

 పేరుకే ప్రతిష్ఠాత్మకం... ఆచరణలో శూన్యం

 

 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి పనులు కూడా ముందుకు సాగడంలేదు. విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఏపీ అమూల్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్‌ భవనాల నిర్మాణాలు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. వీటికి నిధుల కొరత వెంటాడుతోంది. మరో రెండేళ్ల సమయం ఇచ్చినా పనులు పూర్తి అవుతాయన్న ఆశాభావం ఏ కోశాన కనిపించడం లేదు. వారం, పది రోజులకు ఒకసారి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, రెండు, మూడు వారాలకు ఒకసారి పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నా ఫలితం  కనిపించడం లేదు. ప్రతిసారి పురోగతి చూపించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకొంటామని చెబుతారే తప్పా ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. 

 

 

నరసరావుపేట, జూన్‌26: గ్రామ, వార్డు, సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌, డిజిటల్‌ లైబ్రరీలకు శాశ్వత ప్రాతిపదికన భవనాలను నిర్మిస్తామని 2020లో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మధ్యలో పాలకు సంబంధించి బీఎంసీయూ నిర్మాణాలను కూడా వాటిలో చేర్చింది. అప్పట్లో ఆరునెలల్లోగా వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా మహమ్మారి వల్ల పనులు అనుకున్నస్థాయిలో జరగలేదని 2022 మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని గతేడాది తాజాగా ప్రకటించింది. మార్చి దాటి జూన్‌ వచ్చింది. మొత్తం నిర్మించాల్సిన వాటిల్లో 30 శాతంకూడా పూర్తవకపోగా, మరికొన్ని ఎక్కడివక్కడే  అన్న చందాన నిలిచిపోయాయి. కొన్నింటిని అయితే మొదలే పెట్టలేదు. మళ్లీ తాజాగా ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని యంత్రాంగం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే 2022లో కూడా అవి పూర్తయ్యేలా లేవు. వారం, పది రోజులకు ఒకసారి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, రెండు, మూడు వారాలకు ఒకసారి పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నా ఫలితం అయితే కనిపించడం లేదు. ప్రతీసారి పురోగతి చూపించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకొంటామని చెబుతారే తప్పా ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. 


బిల్లుల పెండింగ్‌...

నిర్మాణాలు అనుకున్న స్థాయిలో జరగకపోవడానికి బిల్లులు పెండింగ్‌లో ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. నెలల తరబడి వారికి బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ నిర్మాణాలన్నీ ఉపాధి హామీ నిధులతో ముడిపడి ఉన్నందువల్ల అవి సకాలంలో రాష్ట్ర ఖజానాకు జమ అవుతున్నప్పటికీ కుంటిసాకులతో రాష్ట్రం తాత్సారం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వ్యవధి పెరిగే కొద్దీ వ్యయ అంచనాలు కూడా పెరుగుతున్నాయని దీంతో మరింత భారంగా మారే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. నిర్మాణ పనులకు ఎనిమిది నెలలుగా నిధులు విడుదల కావడంలేదు. కాంట్రాక్టర్లకు బిల్లుల బకాయిలు పేరుకుపొయ్యాయి. దీంతో కొందరు  పనులను నిలిపివేశారు. వీటినిర్మాణాలను అధికశాతం తీసుకుంది వైసీపీనేతలే కావడంతో కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. 


 అద్దెకిచ్చిన యజమానుల గగ్గోలు..

సచివాలయాలు, ఆర్‌బీకేల నిర్వహణకు అద్దెకిచ్చిన యజమానులకు అద్దె సకాలంలో అందకపోవడంతో గగ్గోలుపెడుతున్నారు. కొందరు భవనాల యజమానులు సచివాలయాలను ఖాళీ చేయాలని వత్తిడి తెస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల భవన యజమానులు వాటికి తాళాలు వేసి నిరసన తెలపడం గమనార్హం. ఒకవైపు శాశ్వత భవనాల నిర్మాణాలు చేపట్టిన వారికి బిల్లులు ఇవ్వకపోగా, అద్దెలు సైతం నెలల తరబడి చెల్లించకపోవడం ప్రభుత్వ ఆర్థికపరిస్థితిని సూచిస్తోంది.


కేటాయింపులు ఇలా...

ఆయా భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం ఉపాధి హామీ నిధులకు అనుసంధానం చేసింది.  ఒక్కో ఆర్‌బీకే నిర్మాణానికి రూ.21.08 లక్షలను కేటాయించగా ఇందులో 90 శాతం ఉపాధి హామీ నిధులు కాగా మిగిలిన పదిశాతం రాష్ట్రప్రభుత్వం భరిస్తుందని మార్గదర్శకాలలో పేర్కొంది. గ్రామ సచివాలయాలను మూడు విభాగాలుగా ప్రభుత్వం వర్గీకరించింది. రూ.40, రూ.35, రూ.25 లక్షల ఖర్చుతో ప్రాధాన్యాన్ని బట్టి మూడు రకాల సచివాలయాలను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. వీటిని పూర్తిగా ఉపాధిహామీ నిధులతోనే చేపట్టాలని నిర్ణయించింది. రూ.17.05 లక్షల వ్యయంతో ప్రారంభించిన హెల్త్‌ క్లినిక్‌ల విషయంలో సగం వైద్య ఆరోగ్యశాఖ భరిస్తుండగా మిగిలిన మొత్తాన్ని ఉపాఽధి హామీ పథకం నిధులకు ప్రభుత్వం అనుసంధానం చేసింది. 


గుంటూరు జిల్లాలో..

జిల్లాలో 206 గ్రామ సచివాలయాలకు నూతన భవన నిర్మాణాలను ప్రభుత్వం మంజూరు చేసింది. 2020 సంవత్సరం నుంచే మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకొంటూ వస్తున్నారు. ఇప్పటివరకు 75 పనులు పూర్తి అయ్యాయని చెబుతున్నారు. అలాంటిది మిగతా పనులన్నింటిని ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఎటు వైపు నుంచి చూసినా ఈ ఆదేశాలు అమలు జరిగే పరిస్థితి లేదు. ఇదే విధంగా జిల్లాలో 155 ఆర్‌బీకేలకు శాశ్వత భవన నిర్మాణాలను మంజూరు చేస్తే 29 మాత్రమే పూర్తి అయ్యాయి. కనీసం 20 శాతం పురోగతి కూడా కనిపించడం లేదు. ఇంకా 124 భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉండగా వీటికి సెప్టెంబరు నెలాఖరు లక్ష్యాన్ని నిర్దేశించారు. నాడు - నేడు అంటూ ఆస్పత్రుల గురించి ఢంకా భజాయిస్తున్నారు. 170 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లకు ఇప్పటికి కేవలం 22 మాత్రమే నిర్మాణం జరిగాయి. జగనన్న పాలవెల్లువ అంటూ ఊదరగొడుతున్న ఏపీ అమూల్‌ ప్రాజెక్టు కింద నిర్మాణం తలపెట్టిన బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్లలో 32 సెప్టెంబరు నెలాఖరుకు లక్ష్యాన్ని ఇచ్చారు. వర్క్‌ ఫ్రం హోం అంటూ ప్రతీ గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వాటిల్లో 50 గ్రామాల్లో కూడా ఇప్పటివరకు డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేయలేదు. 


బాపట్ల జిల్లాలో..

జిల్లాలో భవనాల పరిస్థితి ఇలా ఉంది... మొత్తం పూర్తయినవి 30 శాతం కూడా మించలేదు. వివిధస్థాయిల్లో చాలా వరకు పునాదుల దగ్గరే ఆగినవి ఉన్నాయి. సచివాలయ భవనాలు మొత్తం 399 కేటాయించగా, వాటిలో 95 పూర్తయ్యాయి. చివరి దశలో 41, వివిధ స్థాయిల్లో 263 ఉన్నాయి. ఆర్బీకేలు 319 నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా 36 పూర్తయ్యాయి. 22 చివరి దశలో, 261 వివిధ స్థాయిలలో ఉన్నాయి. హెల్త్‌ క్లినిక్‌లు మొత్తం 341 కేటాయించగా, 25 మాత్రమే పూర్తయ్యాయి. 20 చివరి దశకు చేరాయి. 296 వివిధ దశల్లో ఉన్నాయి. డిజిటల్‌ లైబ్రరీలు 109 నిర్మించాలని తలపెట్టగా ఒక్కటి కూడా మొదలు కాలేదు. బీఎంసీయూలు 74 నిర్మించాల్సి ఉండగా ఒకటి మాత్రమే చివరి దశకు చేరింది. 

 

పల్నాడు జిల్లాలో..

పల్నాడు జిల్లాలో రూ.152.40 కోట్ల వ్యయంతో 399 సచివాలయ భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికీ 223 భవనాల నిర్మాణం పూర్తయింది. ఇంకా 176 భవనాలు నిర్మాణ ధశలో ఉన్నాయి. రైతు ప్రయోజనాలు కాపాడేందుకే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేిసినట్టు పాలకులు ఊదరగొడుతున్నారు. 421 ఆర్‌బీకేలను నిర్వహిస్తున్నారు. 293 కేంద్రాలను అద్దె భవనాలలో ఏర్పాటు చేశారు. దాదాపు తొమ్మిది నెలలుగా ఈ భవనాలకు అద్దె చెల్లించడంలేదు. కొన్ని చోట్ల అద్దె బకాయిలు చెల్లించాలని కొందరూ భరోసా కేంద్రాలకు తాళాలు వేసిన ఘటనలు జిలాలో జరిగిన విషయం తెలిసిందే. దాదాపు రూ.1.20 కోట్ల వరకు అద్దె బకాయిలు ఉన్నాయి. 321 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను చేపట్టారు. రూ 69.97 కోట్ల వ్యయంతో భవనాల నిర్మాణాలు చేపట్టగా 132 భవనాల నిర్మాణం పూర్తయింది. ఇంకా 186 భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగంగా హెల్త్‌క్లినిక్‌లను మంజూరు చేసింది. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణానికి రూ.53.90 కోట్లు మంజూరు చేసింది. 308 హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. వీటిలో 93 భవనాల నిర్మాణం పూర్తయింది. 210 భవనాల నిర్మాణం వివిద దశల్లో ఉంది. ఈ భవనాల నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కానరావడంలేదు. 

ఏపీ అమూల్‌ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలో డెయిరీలను కాదని ఇతర రాష్ట్రానికి చెందిన అమూల్‌ డెయిరీకి అనేకరకాలుగా మేలు చేస్తోంది. దీనిలో భాగంగా వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు టార్గెట్‌లు ఇచ్చి మరీ పాల సేకరణ చేయిస్తోంది. అయినా జిల్లా ఈ కేంద్రాలలో నామమాత్రంగానే పాల సేకరణ జరుగుతోంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వం విఫలమైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. వీటి నిర్మాణం అడుగు ముందుకు పడటంలేదు. 86 యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టారు. వీటిలో కేవలం రెండు యూనిట్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. 62 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభమే కాలేదు. 22  యూనిట్ల నిర్మాణ వివిద దశల్లో ఉంది. నెలల తరబడి బిల్లు చెల్లింపులు జరగకపోతుండటంతో కాంట్రాక్టర్లు మొక్కుబడిగా పనులు నిర్వహిస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్లు పనులను నిపివేయడం గమనార్హం. కాగా పంచాయతీరాజ్‌ శాఖ ఎస్సీ వైసీఎస్‌ రాయుడును గురువారం వివరణ కోరగా వారం రోజుల్లో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

 

Updated Date - 2022-06-26T05:30:00+05:30 IST