వ్యాక్సిన్ డోసులు రెండూ వేసుకున్నవారు సైతం మాస్క్ ధరించాలి : డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2021-06-26T18:31:02+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సిన్ నిర్దేశిత మోతాదులను పూర్తిగా తీసుకున్నవారు

వ్యాక్సిన్ డోసులు రెండూ వేసుకున్నవారు సైతం మాస్క్ ధరించాలి : డబ్ల్యూహెచ్ఓ

జెనీవా : కోవిడ్-19 వ్యాక్సిన్ నిర్దేశిత మోతాదులను పూర్తిగా తీసుకున్నవారు సైతం మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. కరోనా వైరస్ రూపాంతరం డెల్టా వేరియంట్‌ చాలా ప్రమాదకరమైనదని, వేగంగా వ్యాప్తి చెందుతుందని, దీని నుంచి తప్పించుకోవడం కోసం పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా కోవిడ్-19 ప్రోటోకాల్స్‌ను పాటించాలని తెలిపింది. మాస్క్ ధారణను కొనసాగించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపింది. 


ఔషధాలు, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల లభ్యత విభాగానికి చెందిన డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ మరియాంగెల సిమావో జెనీవా ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్నవారు కూడా కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. రెండు డోసులు తీసుకున్నామని, తాము సురక్షితంగా ఉన్నామని భావించరాదని స్పష్టం చేశారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ జాగ్రత్తలను పాటించవలసిందేనని వివరించారు. కేవలం వ్యాక్సిన్ మాత్రమే సామాజిక వ్యాప్తిని ఆపలేదన్నారు. మాస్క్‌ ధరిస్తూ, గాలి, వెలుతురు బాగా ప్రసరించే చోట ఉండాలని తెలిపారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకూడదని వివరించారు. 


డెల్టా వేరియంట్ వంటి కరోనా వైరస్ రూపాంతరాలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యాపిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ చాలా దేశాల్లో జరగవలసి ఉందని, ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి తీవ్రమవుతోందని చెప్తోంది. 


డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌కు సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయిల్వార్డ్ మాట్లాడుతూ, కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం అమలు చేస్తున్న కొన్ని చర్యలను తగ్గించవచ్చునని తెలిపారు. అయితే వేర్వేరు దేశాలు వేర్వేరు విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. ఇప్పటికీ జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందన్నారు. కరోనా వైరస్ కొత్త రూపాంతరాలు బయటపడుతున్న సంగతిని గుర్తు చేశారు. 


డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రెయెసుస్ శుక్రవారం మాట్లాడుతూ డెల్టా వేరియంట్ మొదట భారత దేశంలో కనిపించిందన్నారు. ఇది ఇప్పటి వరకు గుర్తించిన వేరియంట్లలో అత్యంత వేగంగా వ్యాపించే రూపాంతరమని తెలిపారు. ఇది ప్రస్తుతం 85 దేశాల్లో వ్యాపిస్తోందన్నారు. 


భారత దేశంలో డెల్టా ప్లస్ రూపాంతరం 12 రాష్ట్రాల్లో కనిపించింది. 51 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న ధోరణి కనిపించడం లేదని అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-06-26T18:31:02+05:30 IST