బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ నో స్టాక్‌.. ఎందువల్లంటే..

ABN , First Publish Date - 2022-06-06T05:34:59+05:30 IST

వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది.

బంకుల్లో  పెట్రోల్‌, డీజిల్‌ నో స్టాక్‌.. ఎందువల్లంటే..
కందుకూరులో మూసి ఉన్న పెట్రోల్‌ బంకు


  • రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పలు బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ నో స్టాక్‌
  • దర్శనమిస్తున్న నో స్టాక్‌ బోర్డులు.. వెనుదిరుగుతున్న వాహనదారులు
  • హెచ్‌పీ, బీపీసీఎల్‌ బంకులకు సగం కోటానే సరఫరా
  • డీలర్లకు క్రెడిట్‌ సౌలభ్యం రద్దు చేసిన ఆయిల్‌ కంపెనీలు
  • ఆలస్యంగా వస్తున్న ట్యాంకర్లు, వాహనదారులకు తప్పని తిప్పలు

వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. ఆయిల్‌ కంపెనీలు ఆయా బంకుల వాస్తవ కోటాకు కోత విధించడంతో పాటు క్రెడిట్‌ సదుపాయాన్ని రద్దు చేశాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పలు బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌కు కొరత ఏర్పడింది. వారంలో రెండు మూడు రోజులు నో స్టాక్‌ బోర్డులు తగిలించుకునే పరిస్థితి ఏర్పండి.


రంగారెడ్డి అర్బన్‌: భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలింయం (హెచ్‌పీసీఎల్‌) బంకుల్లోనే చమురు కొరత తీవ్రంగా కనిపిస్తోంది. క్రెడిట్‌ విధానం రద్దు చేయడంతో వారు నగదు చెల్లించి బుక్‌ చేసినా.. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని బంకుల వద్దకు ట్యాంకర్లు మూడు, నాలుగు రోజులు ఆలస్యంగా పంపుతున్నారని పెట్రోల్‌ బంకు నిర్వాహకులు చెబుతున్నారు. కోటాలో 50 నుంచి 75 శాతం మాత్రమే సరఫరా చేస్తుండటంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఇలాగే కొనసాగితే.. దీని ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అదేవిధంగా పెట్రోల్‌ బంకుల నిర్వహణ కూడా కష్టంగా మారుతుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో 15 పెట్రోల్‌ బంకులు ఉండగా పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా మూడు బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు వేలాడదీశారు. యాచారం మండలంలో 5 బంకులకుగాను రెండు బంకులు మూసి ఉన్నాయి. కందుకూరు మండలంలో 4 పెట్రోల్‌ బంకులు ఉండగా పెట్రోల్‌, డీజిల్‌ కారత కారణంగా అన్ని బంకులు మూసి ఉంచారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో పది పెట్రోల్‌ బంకులు ఉండగా నాలుగు పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. మోమిన్‌పేట మండలంలో మూడు పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం కొరత ఉంది. నిర్వహకులు ప్రస్తుతం నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ ఉన్న బంకుల్లో లిమిటెడ్‌గా పోస్తున్నారు. మెజారిటీ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ నో స్టాక్‌ బోర్డులు పెట్టడంతో మిగతా బంకుల్లో రద్దీ పెరిగింది. ఇంధనం కోసం బారులుదీరుతున్నారు. వాహనదారులు బంకుల వద్ద వాహనాన్ని చాలాసేపు లైన్లో పెట్టాల్సి వస్తుంది.


పెట్రోల్‌, డీజిల్‌ అందుబాటులో లేక ఇబ్బందుల్లో వాహనదారులు

బంకులలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు ఉండటం లేదు. బొంరాస్‌పేట్‌, తుంకిమెట్ల పెట్రోల్‌ బంక్‌లలో ఇంధనం నిల్వలు లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భూములు దుక్కిదున్నేందుకు ట్రాక్టర్‌లలో పోసేందుకు డీజిల్‌ అందుబాటులోలేక సాగు పనులు నిలిచాయి. సొంత వాహనదారులు సైతం పనులను వాయిదా వేసుకుంటున్నారు. ధరలు పెరిగిన సమయంలో అందుబాటులో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌... ప్రస్తుతం ధర తగ్గడంతో బంకుల నిర్వాహకులు కొరత సృష్టించి రిటైల్‌ దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముకునేందుకు బ్లాక్‌ చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఈ మధ్య రేట్లు తగ్గినప్పటి నుంచి బొంరాస్‌పేట్‌తోపాటు తుంకిమెట్ల పెట్రోల్‌ బంక్‌లో ఇంధనం నిల్వలు లేవంటున్నారు. దీంతో ఇక్కడి నుంచి హకీంపేట్‌ గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ తెచ్చుకుంటున్నారు. జేసీబీ, హార్వెస్టర్‌, లారీల యజమానులు కర్నాటక రాష్ట్రంలోని మెతుకు, రెబ్బన్‌పల్లి పెట్రోల్‌ బంక్‌లకు వెళ్లి ఒకేసారి వందలాది లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ను తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా ఇంధన నిల్వలు అందుబాటులో ఉండేవిధంగా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.


మూడు బంకులు తిరిగినా డీజిల్‌ దొరకలేదు

పొలం దున్నుతున్నాను.. సగం పొలం దున్నేసరికి సడన్‌గా ట్రాక్టర్‌ ఆగింది. డీజిల్‌ చెక్‌ చేయగా అయిపోయింది. ట్రాక్టర్‌ను పొలం మధ్యలోనే ఉంచి మండల కేంద్రానికి డీజిల్‌ కోసం బైక్‌పై వెళ్లాను. రెండు మూడు బంక్‌లు తిరిగాను. ఎక్కడ కూడా డీజిల్‌ దొరకలేదు. కనీసం ఒక్క బంకులో కాకున్నా.. మరో బంకులో డీజిల్‌ దొరికేది. రెండు రోజులుగా డీజిల్‌ స్టాక్‌ లేదని బంకు నిర్వహకులు చెబుతున్నారు. 

                                                    -రేణుకుమార్‌, ట్రాక్టర్‌ డ్రైవర్‌, సోమ్లానాయక్‌ తండా 

కర్ణాటకలో లీటర్‌పై రూ.10 తక్కువ 

స్థానికంగా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు లేకపోవడంతో లారీలు, ద్విచక్రవాహనదారుల కోసం కర్నాటకు వెళ్లి డ్రమ్ముల్లో తెచ్చుకుంటున్నారు. ఇక్కడి కంటే అక్కడ లీటర్‌ ధరపై రూ.10 తక్కువకు దొరుకుతుంది. ఇప్పటికైనా వినియోగదారులకు పెట్రోల్‌, డీజిల్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. 

                                                                             - కృష్ణ, లారీ యజమాని 

Updated Date - 2022-06-06T05:34:59+05:30 IST