పండ్ల దుకాణాల్లో ఆకస్మిక దాడులు

ABN , First Publish Date - 2021-05-18T04:12:18+05:30 IST

పండ్లను నిల్వ ఉంచే దుకాణాలపై ఆహార భద్రత ప్రమాణాల శాఖకు చెందిన అధికారుల బృందం సోమవారం జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి దుకాణాల్లో పండ్లకు రసాయనాల వాడకంపై నమూనాలు సేకరించారు.

పండ్ల దుకాణాల్లో ఆకస్మిక దాడులు
నెల్లూరులోని ఓ పండ్ల దుకాణంలో నోటీసు అంటిస్తున్న ఎఫ్‌ఎస్‌వో షమీమ్‌బాషా

రసాయనాల వాడకంపై నమూనాల సేకరణ 

పలువురికి నోటీసులు ఇచ్చిన అధికారులు 

నెల్లూరు (సిటీ), మే 17 : పండ్లను నిల్వ ఉంచే దుకాణాలపై ఆహార భద్రత ప్రమాణాల శాఖకు చెందిన అధికారుల బృందం సోమవారం జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి దుకాణాల్లో పండ్లకు రసాయనాల వాడకంపై నమూనాలు సేకరించారు. నెల్లూరు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించినట్లు ఆ శాఖ జిల్లా కంట్రోలర్‌ ఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ నెల 14వ తేదీన ‘పండు అనారోగ్యం మెండు’ శీర్షికతో వివిధ రకాల పండ్లలో కలుపుతున్న రసాయనాలు, వాటి ప్రభావాలను వివరిస్తూ ఆంధ్రజ్యోతిలో పరిశోధనాత్మక కథనం వెలువడింది. దీనిపై స్పందించిన జిల్లా ఆహార భద్రత ప్రమాణాల శాఖ ఈ మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కంట్రోలర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం కావలిలో ఎఫ్‌ఎస్‌వో నర్మద, సూళ్లూరుపేటలో నీరజా, గూడూరులో చంద్రశేఖర్‌, నెల్లూరులో షమీమ్‌బాషాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. వివిధ రకాల పండ్లును నిల్వ ఉంచిన 15 షాపుల్లో రసాయనాల వాడకం జరిగినట్లు అనుమానంతో వాటి సమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపామని కంట్రోలర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. అక్కడ నుంచి అందే ఫలితాల ఆధారంగా దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఆకస్మిక దాడులు ఈ నెలాఖరు వరకు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-18T04:12:18+05:30 IST