ఎక్కడి నుంచి వచ్చారు.. ఆరోగ్యం ఎలా ఉంది?

ABN , First Publish Date - 2020-05-27T09:41:24+05:30 IST

నగరంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తగ్గినట్టే తగ్గినా కేసుల సంఖ్య

ఎక్కడి నుంచి వచ్చారు.. ఆరోగ్యం ఎలా ఉంది?

కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఫోన్లు


హైదరాబాద్‌ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): నగరంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తగ్గినట్టే తగ్గినా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మే రెండో వారం నుంచి నిత్యం సగటున 25-30కి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో నగరానికి వచ్చిన వారిపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రధాన కార్యాలయంలోని కొవిడ్‌-19 కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఫోన్‌ చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసుల ద్వారా విదేశీయులు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించిన జీహెచ్‌ఎంసీ.. నిత్యం 500 మందికి కాల్‌సెంటర్‌ సిబ్బందితో ఫోన్‌ చేయిస్తోంది. ‘సార్‌ ఎక్కడి నుంచి వచ్చారు.


ఆరోగ్యం ఎలా ఉంది..? జలుబు, జ్వరం, దగ్గు వంటివి ఉన్నాయా? హోం క్వారంటైన్‌లో ఉంటున్నారా? మీ చేతికి క్వారంటైన్‌ ముద్ర వేశారా? అని అడుగుతున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 490 మందికి ఫోన్‌ చేసినట్టు కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ తెలిపారు. కరోనా అనుమానిత కేసులకు సంబంధించిన కాల్స్‌ తగ్గాయని, మంగళవారం ఒక్కరు కూడా కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయలేదన్నారు. అంబులెన్స్‌ కోసం ఐదుగురు, అన్నపూర్ణ భోజనం కోసం 376 మంది నుంచి కాల్స్‌ వచ్చాయని చెప్పారు. 


సరిహద్దులు దాటుతోన్న వైరస్‌

లాక్‌డౌన్‌లో సడలింపుల నేపథ్యంలో విదేశాలు, వివిధ రాష్ర్టాల నుంచి నగరానికి చెందిన వారు వస్తున్నారు. వారితోపాటే వైరస్‌ సరిహద్దులు దాటుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ర్టాల నుంచి ఇప్పటికే వేలమంది ఇక్కడికి చేరుకున్నారని అధికారులు చెబుతున్నారు. వీరిలో కొందరికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అవుతోంది. పరీక్షలు నిర్వహించిన వారిలో మూడో వంతు మందికి పాజిటివ్‌ వస్తోంది. రెండు రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనూ వైరస్‌ ఉన్నట్టు తేలుతోంది.


లక్షణాలుంటే పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు వారందరినీ క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి కోసం హోటళ్లలో పెయిడ్‌ క్వారంటైన్‌లూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇతరులకు ఇళ్లలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వారికి క్రమం తప్పకుండా ఫోన్‌చేసి ఆరోగ్య గురించి ఆరా తీస్తున్నారు. క్వారంటైన్‌ ముద్ర వేయకున్నా.. వేసిన ముద్ర చెరిగిపోయినా సిబ్బందిని పంపుతామని చెబుతున్నారు. 

Updated Date - 2020-05-27T09:41:24+05:30 IST