ఎస్సారెస్పీ నుంచి.. ఈనెల 10వరకే నీటి విడుదల

ABN , First Publish Date - 2021-04-07T06:19:55+05:30 IST

ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టుకు ఈనెల 10వరకే సాగునీటిని అందించనున్నారు. పంటలు చేతికి వస్తుండడం, రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు నిలిపివేయాల ని నిర్ణయం తీసుకున్నారు. అవసరమున్న ప్రాంతాలకు మాత్రం మరికొన్ని రోజులు యాసంగి

ఎస్సారెస్పీ నుంచి.. ఈనెల 10వరకే నీటి విడుదల
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో తగుగతున్న నీటి నిల్వలు

రైతుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్న సంబంధిత అధికారులు

అవసరమున్న ప్రాంతాలలో మరొక తడికి నీటి విడుదలకు ప్రత్యేక చర్యలు

శ్రీరామ సాగర్‌లో తగ్గిన నీటిమట్టం 

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టుకు ఈనెల 10వరకే సాగునీటిని అందించనున్నారు. పంటలు చేతికి వస్తుండడం, రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు నిలిపివేయాల ని నిర్ణయం తీసుకున్నారు. అవసరమున్న ప్రాంతాలకు మాత్రం మరికొన్ని రోజులు యాసంగి పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయనున్నా రు. ఎండలు పెరగడం, పంటలు దగ్గరపడడంతో సాగునీటి శాఖ అధికారు లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సారెస్పీ పరిధిలో ఎగువ మానేరు పైన ఉన్న ఆయకట్టుకు గత డిసెంబరు 4వ వారం నుంచి యాసంగి ఆయకట్టు కు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఆరు లక్షల ఎకరాలకు పైగా సాగు నీటిని అందిస్తున్నారు. ఎల్‌ఎండీ ఎగువతో పాటు దిగువకు కావాల్సిన నీటి ని కూడా కాకతీయ కాల్వ ద్వారా విడుదల చేశారు. ఎస్సారెస్పీ పరిధిలో కాకతీయ, సరస్వతీ, లక్ష్మీ కాల్వల ద్వారా గడిచిన మూడున్నర నెలలుగా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. గుత్ప అలీసాగర్‌  ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. జిల్లాతో పాటు నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల పరిధిలో ఎల్‌ఎండీకి ఎగువన ఉన్న ఆయకట్టు కు నీటి విడుదలను కొనసాగించారు. యాసంగి సాగు మొదలుపెట్టే సమయంలోనే మార్చి చివరి వరకు విడతల వారిగా నీటి విడుదల కొనసాగిస్తామని సాగునీటిశాఖ అధికారులు ప్రకటించారు. రైతులు కూడా యాసంగి సాగును అదే రీతిలో చేయాలని కోరారు. నీటి విడుదలను అనుకున్న ప్రకారం డిసెంబరులోనే విడుదల చేసినా.. ఆయకట్టు పరిధిలోని కొంతమంది రైతులు ఆలస్యంగా వేయడం వల్ల మరో పది రోజులు పెంచి ఈ నెల 10వరకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.

70శాతానికి పైగా చేతికి వచ్చిన వరి

 ఆయకట్టు పరిధిలో 70శాతానికి పైగా రైతులు వరి చేతికి వస్తుండడం తో నీటి వినియోగాన్ని నిలిపివేశారు. మిగతా రైతులు వినియోగించుకుంటున్నారు. కొంతమంది రైతులు పంటలు చేతికి వస్తుండడం వల్ల నీటి విడుదలను నిలిపివేయాలని ఆయా డివిజన్‌ల పరిధిలోని అధికారులను కోరుతున్నారు. మరికొన్ని పంటలు ఉండడం వల్ల ఈ నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఈనెల 10 వరకు నీటి విడుదలను కొనసాగిస్తూనే ఆ తర్వాత కూడా అవసరమైన ప్రాంతాలకు పంటలను కాపాడేందుకు నీటిని మరొకవారం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో నీటి మట్టాలు కూడా తగ్గిపోయాయి. యాసంగి సాగు మొదలుపెట్టే సమయంలో ప్రాజెక్టులో 90టీఎంసీల నీళ్లు ఉన్నాయి. పూర్తిస్థాయి 1091 అడు గుల నీళ్లు ఉన్నాయి. మూడున్నర నెలలు నీటి విడుదల కొనసాగించిన తర్వాత ప్రస్తుతం ప్రాజెక్టులో 1069.40 అడుగుల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు లో 90 టీఎంసీలకు గాను 27.77 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. యాసంగి సాగు తో పాటు మిషన్‌ భగీరథకు విడుదల చేస్తున్నారు. కోరుట్ల, జగిత్యాల, అదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో మిషన్‌ భగీరథ పథకాలకు ఈ నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. వరి కోతలు రైతులు మొదలుపెట్టినందున నీటివిడుదల తగ్గించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌ఎండీ నుంచి ప్రస్తుతం కరీంనగర్‌, వరంగల్‌ రూరల్‌, సూర్యపేట జిల్లాల వరకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నీటి విడుదల కొనసాగిస్తామని ఇంజినీరింగ్‌ చీఫ్‌ శంకర్‌ తెలిపారు. ప్రస్తుతం అన్నిచోట్ల పంటలు వెనక్కు వచ్చాయని ఆయన తెలిపారు. అవసరమున్న గ్రామాల పరిధిలో మరొక తడి కూడా అందిస్తామని ఆయన అన్నారు. రైతుల నుంచి వచ్చే విజ్ఞప్తుల అనుగుణంగా ఈ నీటి విడుదలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ యాసంగిలో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-04-07T06:19:55+05:30 IST