అమ్మో...పోలీసు!

ABN , First Publish Date - 2020-08-07T10:22:23+05:30 IST

జిల్లాలో ‘ఫ్రెండ్లీ పోలీస్‌’ ఎక్కడా కానరావడం లేదు. పోలీసు శాఖలో కొంతమంది దిగువస్థాయి అధికారులు అధికార పార్టీ నేతల..

అమ్మో...పోలీసు!

జిల్లా పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ

ఒత్తిళ్లకు తలొగ్గుతున్న వైనం

న్యాయం కోసం స్టేషన్‌కు వెళితే  దాడులు 

కఠిన చర్యలు చేపడుతున్నా మారని తీరు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ‘ఫ్రెండ్లీ పోలీస్‌’ ఎక్కడా కానరావడం లేదు. పోలీసు శాఖలో కొంతమంది దిగువస్థాయి అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి విధులు నిర్వహిస్తున్నారు. వారు హుకుం జారీచేస్తే చాలు.. న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వెళ్లేవారిపై దాడులకు దిగుతున్నారు. ఇటీవల జిల్లాలో వివిధ పోలీసుస్టేషన్లలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. స్థానిక నేతలు, కొందరు పోలీసు అధికారులు కుమ్మక్కై ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడమే కాకుండా చట్టాన్ని ధిక్కరించి, దాడులకు దిగుతుండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఏడాది కాలంలో నలుగురు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలపై పోలీసు ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.


అయినా ఈ శాఖలోని చాలామందిలో మార్పు రావడం లేదు. తాజాగా కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌కు న్యాయం కోసం వచ్చిన ఓ దళితుడిపై సీఐ దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే.. తాజాగా కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌లో న్యాయం కోసం వచ్చిన ఓ మహిళ శానిటైజర్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశమైంది. కాశీబుగ్గ సీఐపై అట్రాసిటీ కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు. బాధితులకు సాక్షాత్తూ ఎస్పీ అమిత్‌బర్దర్‌ క్షమాపణ చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునారవృతం కాకూడదని పోలీసులు హెచ్చరించారు. ఇది జరిగి 24 గంటలు తిరగకముందే.. కోటబొమ్మాళిలో గురువారం జరిగిన సంఘటన పోలీసుల తీరును ప్రశ్నించేలా చేస్తోంది. కొన్ని పోలీసుస్టేషన్లలో సీఐలు, ఎస్‌ఐలు అధికార పార్టీ నాయకుల అండతో పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. దీంతో వారు చెప్పిందే వేదంగా.. విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తెరవెనుక నేతల ప్రోద్బలంతో కొంతమంది సీఐలు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


శ్రీకాకుళం నగరంలోని రెండు సర్కిళ్ల పరిధిలో పోస్టింగ్‌లు తెచ్చుకున్న ఇద్దరు సీఐలు ఇదే విధంగా వివాదాల్లో చిక్కుకున్నారు. ఏడాది గడవకముందే సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. లాక్‌డౌన్‌ ముందు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక కుటుంబం వచ్చి.. శ్రీకాకుళంలోని ఒక లాడ్జీలో విడిది చేస్తే, అప్పట్లో నగరంలోని టూటౌన్‌ సీఐ.. తనిఖీల పేరుతో హడావుడి సృష్టించారు. అరసవల్లి దేవాలయానికి వెళ్లేందుకు వచ్చామని చెప్పినా.. వినకుండా వారందరినీ పోలీసుస్టేషన్‌కు పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించారు. వారంతా తూ.గో.జిల్లాలో అధికారపార్టీకి చెందిన ముఖ్యనాయకుడి అనుచరులు కావడంతో సీఐ నుంచి  తప్పించుకోగలిగారు. ‘ఓవర్‌ యాక్షన్‌’ చేసినందుకు గానూ వెంటనే సీఐపై బదిలీ వేటు పడింది. 


వన్‌టౌన్‌ పరిధిలో ఒక మహిళా సీఐ.. అధికార పార్టీ నాయకుడి అండతో రెచ్చిపోయి పలువురిపై దాడికి దిగారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఒక హోటల్‌ నిర్వాహకుడిని రాత్రి 11 గంటలకు ఎందుకు దుకాణం తెరిచావంటూ రోడ్డుమీదే చెంప చెల్లుమనిపించింది. ఆయన ఒక ముఖ్య నాయకుడి అనుచరుడు కావడంతో విధిలేక ఆమె క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా జడ్పీ కార్యాలయంలో ఒక మహిళా వైసీసీ నాయకురాలితో వివాదానికి సీఐ కాలు దువ్వారు. దీంతో సీఐ నమ్ముకున్న నేతలే ఆమెను బదిలీ చేయించారని తెలిసింది. ఇక కొత్తూరు మండల సీఐ పరిస్థితి అంతే. స్థానిక అధికార పార్టీ నేతల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడానికి అలవాటుపడడంతో... విధుల్లో చేరిన కొద్ది నెలలలకే మళ్లీ బదిలీ వేటు పడింది. 


సివిల్‌ కేసుల్లో తలదూర్చి...

జిల్లాలో కొందరు సీఐలు సివిల్‌ కేసుల్లో తలదూర్చి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. భూవివాదాలు, కుటుంబ తగాదాల్లో కొందరు సీఐలు, ఎస్‌ఐలు ‘పెద్దన్న’ పాత్రను పోషించి పరిష్కార మార్గాలు వారే చూపుతూ కాసులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, లిక్కర్‌, మట్టి మాఫియాల నుంచి నెలవారీ మామూళ్లు వసూళ్ల విషయంలో   ముందుంటున్నారు. శ్రీకాకుళం, పాలకొండ, రాజాం, టెక్కలి, పలాస, కాశీబుగ్గ, పాతపట్నం, ఇచ్ఛాపురం పోలీసు స్టేషన్లు.. సాయంత్రమైతే చాలు ప్రైవేటు వివాదాలతో రెండు వర్గాల జనంతో కిటకిటలాడుతుంటాయి. 


ఫ్రెండ్లీ పోలీస్‌ ఎక్కడ...

పోలీసు స్టేషన్లలో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’ అమలు చేస్తున్నామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతుండగా, జిల్లాలో ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. సమస్యలు చెప్పుకునేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చే వారికి న్యాయం చేయకపోగా, నేతల దన్నుతో వారి ఆదేశాలను పాటిస్తూ, ఎదురు దాడులకు దిగుతున్నారు. గతంలో పోలీసు స్టేషన్‌కు వచ్చే వారిని ఫ్రంట్‌ ఆఫీస్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌ను అందుబాటులో ఉంచి వారే ఫిర్యాదు నమోదు చేసుకొనేవారు. ఇప్పుడు జిల్లాలో చాలా పోలీసు స్టేషన్‌లలో అసలు ఫ్రంట్‌ ఆఫీసులే లేవు. ప్రతి ఫిర్యాదుదారునికి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకముందే ఫిర్యాదు స్వీకరించినట్లు రశీదు ఇవాల్సి ఉండగా, అదెక్కడా అమలు చేయడం లేదు. స్టేషన్‌కు వచ్చేవారిని పలుకరించే వారే కరువవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కొన్ని పోలీసుస్టేషన్లలో జరుగుతున్న పరిణామాలపై ఎస్పీ అమిత్‌బర్దర్‌ పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  

Updated Date - 2020-08-07T10:22:23+05:30 IST