నిరుపయోగంగా శుద్ధజల ప్లాంటు

ABN , First Publish Date - 2020-08-08T06:00:55+05:30 IST

కాగజ్‌నగర్‌ పట్టణంలో నిర్మించిన శుద్ధ జల ప్లాంటు నిరుపయోగంగా మారింది. ఎస్పీఎంతో పాటు ఇతర కార్మికవర్గాలకు సేవలు

నిరుపయోగంగా శుద్ధజల ప్లాంటు

 2014లో రూ. 2 కోట్లతో నిర్మాణం

అధికారులు పట్టించుకోక పోవడంతో అలంకారప్రాయంగా మారిన వైనం


కాగజ్‌నగర్‌, ఆగస్టు 7:  కాగజ్‌నగర్‌ పట్టణంలో నిర్మించిన శుద్ధ జల ప్లాంటు నిరుపయోగంగా మారింది. ఎస్పీఎంతో పాటు ఇతర కార్మికవర్గాలకు సేవలు అందించేందుకు పట్టణంలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో వినియోగించే నీటిని బయటకు వదిలివేయడంతో ఓ చోట నిలచిపోయి అక్కడికి వచ్చే వారికి ఇబ్బందులు కలిగేది. దీంతో అధికారులు ఆ నీరు వృథా కాకుండా రిసైక్లింగ్‌ చేసి వినియోగించేందుకు 2014లో రూ.2కోట్లతో శుద్ధ జల ప్లాంటును నిర్మించారు. ఆస్పత్రి నుంచి వృథాగా పోయే నీటిని ప్రొగ్రాం లాజిక్‌ కంట్రోలర్‌ (పీఎల్‌సీ) సిస్టం ద్వారా శుద్ధి చేసి వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.  


నిర్మాణం పూర్తి చేసినా..

శుద్ధ జల ప్లాంటు నిర్మాణం సదరు కాంట్రాక్టర్‌ పూర్తి చేసి బిల్లులు తీసుకున్నాడు. అనంతరం అధికారులు దీన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు శ్రద్ధ చూపక పోవడంతో ప్లాంటు అలంకారప్రాయంగా మారింది.  ఎస్పీఎం 2014లో మూత పడడంతో కార్మికులకు ఆస్పత్రిలో సేవలు నిలిచిపోయాయి. బయటి నుంచి కూడా కార్మికులు ఈఎస్‌ఐ సేవలను అంతంత మాత్రంగానే వినియోగించుకుంటుండడంతో ఆస్పత్రిలో నీటి వినియోగం లేకుండా పోయింది. దీంతో అధికారులు దీని విషయం పట్టించుకోవడం లేదు.  ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు. దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన శుద్ధ జల ప్లాంటు నిరుపయోగంగా మారింది. కాగా అధికారులు ఏటా ప్రత్యేక మెయింటెన్స్‌ కింద నిధులు కేటాయిస్తుండడం విశేషం. 


 వినియోగంలోకి తీసుకురావాలి..ఈర్ల విశ్వేశ్వర్‌ రావు, కాగజ్‌నగర్‌  

శుద్ధ జల ప్లాంటును వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. 2014లో ప్లాంటు నిర్మిస్తున్నప్పుడే దీనిపై పునరాలోచించాలని కోరాం. అధికారులు పట్టించుకోలేదు. అదే సమయంలో ఎస్పీఎం యాజమాన్యం ముందస్తుగానే షెడ్‌ డౌన్‌పేరిట మిల్లు మూసి వేసింది. దీంతో ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సేవలు అంతంత మాత్రంగానే ఉండడంతో నీటి వినియోగం కూడా తగ్గింది. ఇంక రిసైక్లింగ్‌ ప్లాంటు వల్ల ఉపయోగం లేకుండా పోయింది.


ప్లాంటు నిర్మాణం వృథా..అంబాల ఓదెలు, కాగజ్‌నగర్‌ 

ఈఎస్‌ఐలో శుద్ధ జల ప్లాంటు వృథాగా నిర్మించారు. మొదట్లోనే దీని నిర్మాణంపై నిరసన వ్యక్తం చేశాం. అయినా కూడా ఈఎస్‌ఐ ఉన్నతాఽధికారులు వినిపించుకోకుండా ఏక పక్షంగా నిర్మాణం చేపట్టారు. దీని ద్వారా ఏమీ ప్రయోజనం లేదు. ఈఎస్‌ఐ మనుగడే ఇప్పుడు కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో ఈ నిర్మాణంతో లక్షలాది రూపాయల నిధులు వృథా అయ్యాయి. కనీసం ఈ నిధులతో ఈఎస్‌ఐ కార్మికుల నివాస క్వార్టర్లకు మరమ్మతులు చేపట్టినా బాగుండేది. ఇదే విషయాన్ని గతంలోనే అధికారులకు లిఖిత పూర్వకంగా వివరించాం.


Updated Date - 2020-08-08T06:00:55+05:30 IST