ఉచిత నీటి పథకం కోసం కోర్టుకు..

ABN , First Publish Date - 2022-01-29T15:43:50+05:30 IST

జీహెచ్‌ఎంసీలో మాదిరిగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని

ఉచిత నీటి పథకం కోసం కోర్టుకు..

కంటోన్మెంట్‌ నామినేటెడ్‌ సభ్యుడు జె.రామకృష్ణ 

సికింద్రాబాద్‌: జీహెచ్‌ఎంసీలో మాదిరిగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు కంటోన్మెంట్‌ నామినేటెడ్‌ సభ్యుడు జె.రామకృష్ణ చెప్పారు. న్యాయస్థానం స్పందించి, ఫిబ్రవరి 10 లోపు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొదటి నుంచీ కంటోన్మెంట్‌ పట్ల సవతి ప్రేమ చూపుతోందని విమర్శించారు. జీహెచ్‌ఎంసీలో మాదిరిగా కంటోన్మెంట్‌లో ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని అమలు చేయడం లేదని చెప్పారు. ఈ విషయంలో స్థానిక శాసనసభ్యుడు, మంత్రులు విఫలం చెందారని, అందుకే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్టు తెలిపారు. 


సాంకేతిక అడ్డంకుల వల్ల జాప్యం : ఎమ్మెల్యే సాయన్న 

కంటోన్మెంట్‌కు ఉచిత నీటి పథకం వర్తింపు చేస్తూ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని, ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎస్‌ను ఆదేశించారని ఎమ్మెల్యే జి.సాయన్న చెప్పారు. సాంకేతికంగా కొన్ని అడ్డంకులు ఉండడంతో కంటోన్మెంట్‌లో జాప్యం జరిగిందని, వచ్చే నెల 2న దీనిపై ప్రత్యేక సమావేశం జరగనుందని తెలిపారు. సమావేశం అనంతరం ప్రకటన చేయనున్నట్టు సాయన్న వెల్లడించారు. రూ.80 కోట్ల టీపీటీ చార్జీల బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ నుంచి రావలసిన 900 కోట్ల రూపాయిల సర్వీసు చార్జీల బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు చెప్పారు.

Updated Date - 2022-01-29T15:43:50+05:30 IST