వచ్చే నెల నుంచి ఉచిత బియ్యం

ABN , First Publish Date - 2022-07-25T05:21:30+05:30 IST

కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీకి ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఆగస్టు నుంచి యథావిధిగా బియ్యం పేదలకు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

వచ్చే నెల నుంచి ఉచిత బియ్యం

పంపిణీకి చర్యలు
ముగిసిన నెలలపై కానరాని స్పష్టత


కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీకి ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఆగస్టు నుంచి యథావిధిగా బియ్యం పేదలకు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  మూడు నెలలుగా కేంద్రం అందించే ఉచిత బియ్యం పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతుండడం, ధాన్యం సేకరణ నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వచ్చే నెల నుంచి అందించేందుకు తాజాగా నిర్ణయించింది. దీనిపై జిల్లా అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.

రాజాం, జూలై 24:  కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. ఈ పథకాన్ని ఆరు నెలల పాటు అమలు చేశాక విడతల వారీగా పొడిగిస్తూ వస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 30 శాతం బియ్యం కేటాయించకపోవడంతో పంపిణీ ప్రక్రియ మూడు నెలలుగా నిలిచిపోయింది. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాన్ని గట్టిగా ప్రశ్నించింది. బియ్యం పంపిణీలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగింది. పంపిణీ చేయకపోతే రాష్ట్రానికి రావాల్సిన పథకాలు నిలిపి వేస్తామని, ధాన్యం సేకరణ ఆపేస్తామని హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలకు దిగింది.  కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం అధికారులు కూడా సన్నాహాలు చేస్తున్నారు.

 ప్రభుత్వం ఆగస్టు నెల నుంచి బియ్యం పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది అయితే ఈ పథకం కింద మే, జూన్‌, జూలై నెలలకు సంబంధించిన ఉచిత రేషన్‌ కూడా అందించాల్సి ఉంది. గడిచిన మూడు నెలల బియ్యం పంపిణీ విషయంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని జిల్లా అధికారులు అంటున్నారు. పేద ప్రజలు మాత్రం ఉచిత బియ్యం మొత్తం అందుతాయని ఎదురుచూస్తున్నారు.

పంపిణీకి ఆదేశాలు వచ్చాయి
ఆగస్టు నెల నుంచి బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. గడిచిన మూడు నెలల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. ఆగస్టు నెలకు మాత్రం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకు బియ్యం అందజేస్తాం   
         - పాపారావు, డీఎస్‌వో, విజయనగరం

Updated Date - 2022-07-25T05:21:30+05:30 IST