ఎవరికి చెప్పుకోవాలో!

ABN , First Publish Date - 2021-10-24T06:00:35+05:30 IST

తూనికలు, కొలతలు... ఈ శాఖ ఒకటుందని జిల్లాలో చాలామందికి తెలియదు. తూకాల్లో మోసం, వస్తువుల్లో కల్తీ నియంత్రణ ఆ శాఖ ప్రధాన విధి. నగరాల్లో షాపింగ్‌ మాల్‌ నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని వారపు సంతల వరకూ నిత్యం వారు తనిఖీలు చేయాలి. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలి.

ఎవరికి చెప్పుకోవాలో!


వస్తు క్రయవిక్రయాల్లో మోసాలు

అన్నింటా కల్తీయే

నిద్దరోతున్న తూనికలు, కొలతల శాఖ

తూతూమంత్రపు తనిఖీలతో సరి

సిబ్బంది కొరతను సాకుగా చూపుతున్న వైనం

మోసాలపై ఫిర్యాదులకు నెం: 93981 53671 

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

పండ్ల నుంచి కూరగాయల వరకూ... నిత్యావసరాల నుంచి ఆహార పదార్థాల వరకూ...  కూల్‌డ్రింక్స్‌...పెట్రోలు... డీజిల్‌... ఇలా ప్రతి వస్తువు విక్రయంలోనూ జిల్లాలో భారీగా మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కల్తీ... మరోవైపు తూకాల్లో మోసాలతో వినియోగదారులు  నష్టపోతున్నారు. కొందరు వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించడం లేదు. జిల్లా కేంద్రం నుంచి మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకూ కల్తీలు, మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. నియంత్రించాల్సిన తూనికలు, కొలతల శాఖ నిద్దరోతోంది. తూతూమంత్రపు తనిఖీలు... కేసులతో సరిపెడుతోంది.

-తూనికలు, కొలతలు... ఈ శాఖ ఒకటుందని జిల్లాలో చాలామందికి తెలియదు. తూకాల్లో మోసం, వస్తువుల్లో కల్తీ నియంత్రణ ఆ శాఖ ప్రధాన విధి. నగరాల్లో షాపింగ్‌ మాల్‌ నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని వారపు సంతల వరకూ నిత్యం వారు తనిఖీలు చేయాలి. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలి. కానీ జిల్లాలో ఇటువంటివి ఏవీ కానరావడం లేదు. దీంతో వ్యాపారులు, అక్రమార్జనకు అలవాటుపడిన వారు రెచ్చిపోతున్నారు. వినియోగదారులను నిలువునా మోసాలకు గురిచేస్తున్నారు. నిత్యావసరాలు, ఇతర ఆహార పదార్థాలు, పండ్ల తూకాల్లో మోసాల సంగతి చెప్పనక్కర్లేదు. కిలో దగ్గర 200 గ్రాముల వరకూ తగ్గించి అమ్ముతున్నారు. కొన్ని వస్తువులను ప్రామాణిక ముద్రతో విక్రయించాల్సి ఉన్నా ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. ప్రధానంగా వారపు సంతలు, మార్కెట్లు, రైతు బజారుల్లో సైతం రాళ్లనే తూనికలకు వినియోగి స్తున్నారు. ఇక సాధారణ తూనిక రాళ్లపై ఎటువంటి ముద్రలూ ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే వ్యాపారులు చెప్పిందే వేదం. 

డే అండ్‌ నైట్‌ కూడలిలో దారుణం

శ్రీకాకుళం నగరంలోలోని డే అండ్‌ నైట్‌ కూడలి సమీపంలోని అంబేద్కర్‌ జంక్షన్‌, పాత బస్టాండు, రామలక్ష్మణ జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లోని పండ్ల వ్యాపారుల్లో అత్యధిక శాతం తూనికల్లో యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా వినియోగదారుడు ప్రశ్నిస్తే... అక్కడి వ్యాపారులంతా మూకుమ్మడిగా దాడులకు దిగుతున్న సంఘటన లూ ఉంటున్నాయి. స్థానిక అంబేద్కర్‌ జంక్షన్‌లో తూకాల్లో మోసాలపై  ప్రశ్నించడమంటే కోరి ప్రమాదం తెచ్చుకున్నట్టే. అంతగా అక్కడి వ్యాపారులు జులుం ప్రదర్శిస్తారు. 

 ముద్రిత ధర తొలగించి..

కూల్‌డ్రింక్‌ల విక్రయాల్లో భారీ దోపిడీకి తెరదీశారు. సాధారణంగా సీసాలపై ధర, తయారీ, మనుగడ వంటివి ముద్రించి ఉంటుంది. కానీ కొందరు వ్యాపారులు ధరను చెరిపేస్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, బస్టాండ్ల సమీపంలో అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ప్రతి వస్తువుపై ధర పెంచి అమ్ముతున్నారు. శ్రీకాకుళం నగరం మొదలుకొని అన్ని పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ధర వ్యత్యాసం గురించి ప్రశ్నిస్తే..ఇష్టముంటే కొనండి..లేకుంటే వెళ్లిపోండి అంటూ వ్యాపారులు తేల్చిచెబుతున్నారు. ఇక వారపు సంతల సంగతి చెప్పనక్కర్లేదు. గ్రామీణ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో బుడుమూరు, నారాయణవలస, చింతాడ, అంపురంతో పాటు పదుల సంఖ్యలో వారపు సంతలు జరుగుతున్నాయి. వారం వారం లక్షలాది రూపాయల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి.  వీటిపై అధికారుల స్థాయిలో కనీస పర్యవేక్షణ లేదు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తే ఎన్నో మోసాలు వెలుగుచూసే అవకాశముంది. కానీ తూనికలు, కొలతల శాఖ అధికారులు అటువైపుగా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. మామూళ్లు అందుతుండడం వల్లనేనంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

 అరకొరగా సిబ్బంది

శ్రీకాకుళం నగరంలోని పీఎన్‌ కాలనీలో తూనికలు, కొలతల శాఖ జిల్లా కార్యాలయం ఉంది.  ఒక అసిస్టెంట్‌ కంట్రోలర్‌, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, అటెండర్లు ఉండాలి. కానీ జిల్లా కేంద్రంలో అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఒకరే ఉన్నారు. శ్రీకాకుళం డివిజన్‌కు సంబంధించి తూనికలు, కొలతలు శాఖ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులో ఇన్‌చార్జి కొనసాగుతున్నారు. ఆయన విశాఖలో రెగ్యులర్‌  అధికారి..ఇక్కడ ఇన్‌చార్జిగా నియమించారు. అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు.  ఇక ఇన్ప్‌క్టర్‌కు ఒక టెక్నికల్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ ఉండాలి. ఆ పోస్టులు చాన్నాళ్ల నుంచి ఖాళీగానే ఉన్నాయి. నరసన్నపేట ఇన్‌స్పెక్టర్‌గా కె.రత్నరాజు విధులు నిర్వహిస్తున్నారు. పలాస డివిజన్‌కు వచ్చేసరికి ఇక్కడ ఇన్‌స్పెక్టర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్‌ కంట్రోలర్‌ అధికారిగా విశ్వేశ్వరరావు చూస్తున్నారు. స్థానికంగా ఉన్న బాధ్యతలన్నీ ఆయనవే. సిబ్బంది కొరతతో సతమతమవుతున్నామని..అయినా ఉన్నంతలో తనిఖీలు చేపడుతున్నామని..కేసులు నమోదుచేసి అపరాధ రుసుం విధిస్తున్నట్టు చెబుతున్నారు. 

 కేసులు నమోదు చేస్తున్నాం

తనిఖీలు విస్తృతం చేశాం. తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది సీళ్లు ద్వారా (ముద్రణ) రూ.31 లక్షల 60 వేల 230 ఆదాయం సమకూరింది. రూ. 27లక్షల 46వేల 720 అపరాధ రుసుం విధించాం. శాఖపరంగా సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఉన్నంతలో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నాం. ఎక్కడైనా వ్యాపారులు మోసాలకు పాల్పడితే 93981 53671కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయండి. 

- విశ్వేశ్వరరావు, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ అధికారి, శ్రీకాకుళం



Updated Date - 2021-10-24T06:00:35+05:30 IST