Be Careful : Facebook వేదికగా ఇలాంటివి కూడా జరుగుతున్నాయ్.. సినీ ఫక్కీలో భారీ మోసం..!

ABN , First Publish Date - 2021-11-04T12:16:55+05:30 IST

ఫేస్‌బుక్‌ వేదికగా ఆన్‌లైన్‌ మోసాలే కాదు.. ఇలాంటివి కూడా..

Be Careful : Facebook వేదికగా ఇలాంటివి కూడా జరుగుతున్నాయ్.. సినీ ఫక్కీలో భారీ మోసం..!

  • బంగారంతో బురిడీ 
  • రూ. 38.5 లక్షలు మోసం
  • తక్కువ ధరకేనంటూ నగరవాసికి టోకరా
  • సినీ ఫక్కీలో బ్రీఫ్‌ కేసు తారు మారు

హైదరాబాద్‌ సిటీ : ఫేస్‌బుక్‌ వేదికగా ఆన్‌లైన్‌ మోసాలే కాదు.. ఆఫ్‌లైన్‌ మోసాలు కూడా చేయొచ్చని ఈ ముఠా కొత్త అర్థం చెప్పింది. తక్కువ ధరకే కిలో బంగారం ఇస్తామని ఆశపెట్టి రూ.38.5 లక్షలు దోచుకుంది. బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ అంజనీకుమార్‌, ఈస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ రమేశ్‌లు కేసు వివరాలు వెల్లడించారు.


మల్లేపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ అఫ్రోజ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌. నెలన్నర క్రితం ఢిల్లీకి చెందిన గౌతమ్‌ తక్కువ ధరకు బంగారాన్ని విక్రయిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆశపడిన అఫ్రోజ్‌ సదరు వ్యక్తికి ఫోన్‌ చేయగా, కేజీ బంగారం రూ.42లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దానికోసం అతను సూచించిన ముంబైకి చెందిన అమిత్‌పటేల్‌ (గుల్జార్‌)తో, ఆ తర్వాత హైదరాబాద్‌ ఏజెంట్‌ రెడ్డి పాండురంగారావుతో మాట్లాడాడు. రెండు వారాల చర్చల అనంతరం బంగారాన్ని ముఖేశ్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ తీసుకొస్తాడని, అతనికి డబ్బు చెల్లించాలని రెడ్డి పాండురంగారావు సూచించాడు. ఆ తర్వాత ముఖేష్‌, అన్వేష్‌ అలియాస్‌ కిరణ్‌లు మెహిదీపట్నం, నాచారం ప్రాంతాల్లో రెండుసార్లు అఫ్రోజ్‌ను కలిసి బంగారు బిస్కెట్లు చూపించి నమ్మించారు.


గత నెల 25న ముఖేష్‌ నేరుగా బాధితుడితో మాట్లాడి రెడ్డి పాండురంగారావు, కిరణ్‌లకు డబ్బులు చెల్లించి బంగారం తీసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత నింబోలిఅడ్డాలో ఉన్న బాధితుడి ఫ్లాట్‌ వద్దకు వారిద్దరూ రెండు బ్రీఫ్‌ కేసులతో వచ్చారు. బాధితుడు వారికి రూ. 42లక్షలు ఇవ్వగా అతనికి డిస్కౌంట్‌ ఇస్తున్నామని చెప్పి రూ.3.5లక్షలు తిరిగి ఇచ్చేశారు. మిగతా డబ్బు రూ. 38.5లక్షలను రెడ్డి పాండురంగారావు లెక్కపెట్టి ఓ బ్రీఫ్‌కే‌స్‌లో పెట్టుకున్నాడు. బాధితుడిని మాటల్లో మభ్యపెట్టి డబ్బున్న బ్రీఫ్‌కేసును కిందకు, డబ్బులేని బ్రీఫ్‌కేసును పైకి తారుమారు చేశారు.


ఆ తర్వాత బంగారు బిస్కెట్లకు సంబంధించిన బ్రీఫ్‌కేసు కాకుండా పొరపాటున వేరే బ్రీఫ్‌కేసు తెచ్చామని, ఇప్పుడే బంగారు బిస్కెట్లు తెస్తామని బాధితుడిని నమ్మించి ఖాళీ బ్రీఫ్‌ కేస్‌ను అతనికి ఇచ్చేసి వెళ్లారు. మాటల్లో ఇది గమనించని బాధితుడు ఆ తర్వాత మోసం జరిగిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహమ్మద్‌ రఫీక్‌ (45) అలియాస్‌ రెడ్డి (కాలాబురాగీ, గుల్బర్గా), ముఖేశ్‌ (55) (థానె, మహారాష్ట్ర), రెడ్డి పాండురంగారావు (53) (పశ్చిమ గోదావరి), అన్వేష్‌ కుమార్‌(32)లను అరెస్ట్‌ చేశారు. వికాస్‌ గౌతమ్‌, అమిత్‌ పటేల్‌లు పరారీలో ఉన్నారని సీపీ వివరించారు. వారి నుంచి రూ.20లక్షలు నగదు, 13 రెగ్జిన్‌ బ్యాగులతో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-11-04T12:16:55+05:30 IST