ఈఏపీ సెట్‌లో నాలుగో ర్యాంకు

ABN , First Publish Date - 2022-07-27T05:09:24+05:30 IST

ఏపీ ఈఏపీ సెట్‌లో బొబ్బిలి కుర్రాడు ఉమేష్‌ కార్తికేయ సత్తా చాటాడు. రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. చిన్నప్పటి నుంచి చదువులో బాగా రాణిస్తున్నాడు.

ఈఏపీ సెట్‌లో నాలుగో ర్యాంకు
త్రాసుల ఉమేష్‌ కార్తికేయ


సత్తా చాటిన ఉమేష్‌ కార్తికేయ
ముంబయి ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం: కార్తికేయ

బొబ్బిలి, జూలై 26:

ఏపీ ఈఏపీ సెట్‌లో బొబ్బిలి కుర్రాడు ఉమేష్‌ కార్తికేయ సత్తా చాటాడు. రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. చిన్నప్పటి నుంచి చదువులో బాగా రాణిస్తున్నాడు. ముంబయి ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.
పట్టణంలోని మహారాజుపేటకు చెందిన త్రాసుల ఉమేష్‌ కార్తికేయ ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో నాలుగో ర్యాంకు సాధించాడు. 156.7982 నార్మలైజ్డ్‌ మార్కులతో ఈ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఇటీవల జరిగిన ఐఐటీ మెయిన్స్‌లో 99.956 పర్సంటైల్‌ తెచ్చుకున్నాడు. కార్తికేయ తండ్రి ఈశ్వరరావు బాడంగి మండలం వాడాడ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో లెక్కలు ఉపాఽధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి ఉమ గృహిణి. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం గంగాడ వీరి స్వగ్రామం. పిల్లల చదువు కోసం చాలా సంవత్సరాల కిందట ఈశ్వరరావు బొబ్బిలి పట్టణానికి కుటుంబ సమేతంగా వచ్చేశారు. కార్తికేయ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు బొబ్బిలిలోనూ.. 8 నుంచి టెన్త్‌ వరకు విశాఖలోనూ.. ఇంటర్మీడియట్‌ను విజయవాడలో చదువుకున్నాడు. అతని  తమ్ముడు స్థానిక హైస్కూలులో చదువుకుంటున్నాడు. ముంబయి ఐఐటీలో సీఎస్‌ఈ సీటు సాధించాలన్నది తన లక్ష్యమని, ఆ తరువాత సివిల్స్‌ పాసై కలెక్టర్‌ కావాలని అనుకుంటున్నట్లు కార్తికేయ తెలిపారు. తమ కుమారుడు రాష్ట్రస్థాయిలో నాలుగోర్యాంకు సాధించడంతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. సహచర ఉపాధ్యాయులంతా కార్తికేయ తండ్రి ఈశ్వరరావును అభినందించారు.
 270వ ర్యాంకు సాధించిన మణిదీప్‌నాయుడు
బొబ్బిలి పట్టణంలోని సాహితీనగర్‌కు చెందిన గొర్లె మణిదీప్‌నాయుడు ఈఏపీ సెట్‌లో 131 మార్కులతో  270వ ర్యాంకు సాధించాడు.  ఈయన తల్లిదండ్రులు జగదీశ్వరరావు, బొద్దల  విజయలక్ష్మిలు ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే. కుమారుడు ఇంజనీరింగ్‌ సెట్‌లో మంచి ర్యాంకు సాధించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జేఈఈ మెయిన్స్‌లో 99.45 పర్సంటైల్‌ సాధించాడు.


Updated Date - 2022-07-27T05:09:24+05:30 IST