జిల్లాకు నాలుగు పదవులు

ABN , First Publish Date - 2020-10-01T11:00:17+05:30 IST

జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కాయి. అందు లో రెండు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఒంగోలుకు లభించాయి

జిల్లాకు నాలుగు పదవులు

బీసీ కార్పొరేషన్లకు చైర్మన్ల నియమాకం

మంత్రి బాలినేని ఇలాకాలోనే రెండు 

చీరాలకు, కనిగిరికి ఒక్కొక్కటి 

విద్యాధికులకే ప్రాధాన్యం

ప్రధాన బీసీ కులాలకు 

దక్కని అవకాశం 


ఆంధ్రజ్యోతి, ఒంగోలు :

జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కాయి. అందు లో రెండు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఒంగోలుకు లభించాయి. చీరాల, కనిగిరి నియోజకవర్గాలను ఒక్కొక్కటి వరించింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల వారు డైరెక్టర్‌ పదవులతో సరిపుచ్చుకోవాల్సి ఉంది. జిల్లాలో జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యం ఉన్న బీసీ కులాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కకపోవడంపై ఆ వర్గాల వారు పెదవి విరుస్తున్నారు.  


నలుగురూ విద్యాధికులే

బీసీలలోని కులాల వారీ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభు త్వం వాటికి చైర్మన్లను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేదర కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఒంగోలుకు చెందిన కె.లలితనాంచారమ్మను నియమించింది. చత్తాడ శ్రీవైష్ణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఒంగోలుకే చెందిన టి.మనోజ్‌కుమార్‌ నియమితులయ్యారు. దేవాంగ కార్పొరేషన్‌ చైర్మన్‌గా చీరాల నియోజకవర్గానికి చెందిన బీరక సురేంద్రబాబు, ఆరె కటిక కొర్పొరేష్‌ చైర్మన్‌గా కనిగిరి నియోజకవర్గానికి చెందిన దాదా కుమారలక్ష్మిని నియమించింది. ఈ నలుగురూ విద్యావంతులే. లలిత నాంచారమ్మ ఎమ్మెస్సీ, బీఈడీ చేయగా, మనోజ్‌కుమార్‌ బీకాం కంప్యూటర్స్‌ చదివారు. సురేంద్రబాబు బీటెక్‌ పూర్తి చేయగా, కుమారలక్ష్మి డిగ్రీ పూర్తి చేసింది. 


ముగ్గురు వైసీపీ సానుభూతిపరులు

ఛైర్మన్‌ పదవులు పొందిన నలుగురిలో ముగ్గురు వైసీపీ సా నుభూతిపరులని సమాచారం. ఒకరు మాత్రం క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. దేవాంగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఎంపికైన బీరక సురేంద్రబాబు ఐటీ ఉద్యోగం కూడా చేశారు. గత ఎన్నికలకు ముందు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో చీరాల వైసీపీ టిక్కెట్‌ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలోని అధికారపార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలకు అతీతంగా సురేంద్రబాబుని చైర్మన్‌ పదవికి ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇక మేదర కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఎంపికైన లలితనాంచారమ్మ  ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు.  ఆమె మామ మేదరసంఘం నాయకుడిగా రాజకీయంగా వైసీపీతో ఉన్నారు. శ్రీవైష్ణవ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎంపికైన మనోజ్‌కుమార్‌ కూడా వైసీపీ సానుభూతిపరుడు, ఆరెకటిక కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఎంపికైన కుమారలక్ష్మి కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం కంకణంపాడు గ్రా మవాసి. ప్రస్తుతం ఆమె వలంటీర్‌. కడప జిల్లాకు చెందిన ఆమె ఏడాదిన్నర క్రితం కంకణంపాడు వాసిని వివాహం చేసుకుని ఇక్కడికొచ్చారు. ఆమె భర్త వైసీపీ సానుభూతి పరుడు. ఆమె సమీప బంధువు వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్నారు.  


ప్రధాన బీసీ కులాల్లో అసంతృప్తి

జిల్లాలో జనాభా రీత్యా గుర్తింపు స్థాయిలో ఉండి రాజకీయంగా కూడా ప్రాధాన్యత నిచ్చే కొన్ని కులాల కార్పొరేషన్‌ల చైర్మన్‌ పదవులు జిల్లాకు దక్కకపోవడంతో బీసీ వర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. వివిధ కారణాల దృష్ట్యా జిల్లాకు కొన్ని ముఖ్యమైన కార్పొరేషన్‌ పదవులు వస్తాయని భావించారు. అయితే జిల్లా నేతల నుంచి సరైన ఒత్తిడి లేకే రాలేదన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇతర జిల్లాల్లో సరైన వారు దొరకని కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను మాత్రమే మన జిల్లాకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కావాలని మంత్రి బాలినేని సీఎం జగన్‌ని కోరారు. ఇప్పటికే వేరేవారికి మాటిచ్చినందున వచ్చేసారి చూద్దామని ఆయన చెప్పినట్లు తెలిసింది. దీంతో మేదర, శ్రీవైష్ణవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులకు ప్రతిపాదనలిచ్చారు. చివర్లో విషయం తెలుసుకున్న వైసీపీ అద్దంకి ఇన్‌చార్జి కృష్ణచైతన్య  శ్రీవైష్ణవ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికోసం విఫలయత్నం చేశారు.


వైసీపీలో చురుకైన యువ నాయకుడిని తీసుకెళ్లి పదవి కోసం పట్టుబట్టారు. అప్పటికే బాలినేని ఒంగోలు నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయటంతో చైతన్య ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది. అలాగే గిద్దలూరు, దర్శి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలతోపాటు మరోమంత్రి సురేష్‌ కూడా వారి నియోజకవర్గాల్లో ఒకరిద్దరు నాయకులకు ఛైర్మన్‌ పదవులు ఇప్పించుకునే ప్రయత్నాలు చేసినా ఫలించ లేదు. అయితే ఒంగోలు నియోజకవర్గానికే రెండు చైర్మన్‌ పదవులు ఇవ్వకుండా ఒకదానికే పరిమితం చేసి, మరొకటి ఇంకో నియోజకవర్గానికి ఇచ్చి ఉంటే బాగుండేదని కొందరు అంటున్నారు. విషయంలో మంత్రి బాలినేని వ్యవహార శైలిని వారు తప్పుబడుతున్నారు. 

Updated Date - 2020-10-01T11:00:17+05:30 IST