బీసీ కార్పొరేషన్లలో తూ.గో. జిల్లాకు నాలుగు..

ABN , First Publish Date - 2020-10-01T08:23:11+05:30 IST

రాష్ట్రంలోని బీసీ వర్గాలకు చెందిన నాలుగు కార్పొరేషన్‌లకు జిల్లాకు చెందిన వారిని చైర్మన్లుగా ఎంపిక

బీసీ కార్పొరేషన్లలో తూ.గో. జిల్లాకు నాలుగు..

జిల్లాకు నాలుగు చైర్మన్‌ పదవులు

 కార్పొరేషన్‌ చైర్మన్లుగా బందన హరి (అగ్నికుల  క్షత్రియ),  సంకిస భవాని (తెలుకుల), ఆవాల రాజేశ్వరి (అయ్యారక),  పురుషోత్తం గంగాభవాని (పెరిక) 

అధికారికంగా జాబితా ప్రకటించని ప్రభుత్వం


కాకినాడ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బీసీ వర్గాలకు చెందిన నాలుగు కార్పొరేషన్‌లకు జిల్లాకు చెందిన వారిని చైర్మన్లుగా ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఒక్కటిగా ఉన్న బీసీ కార్పొరేషన్‌ను బీసీ కులాల్లో ఉన్న జనాభా దామాషా మేరకు 56 కార్పొరేషన్‌లుగా విభజిం చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ఆయా బీసీ వర్గాల కార్పొరేషన్‌ లతోపాటు, కొత్తగా ఏర్పాటు చేసిన తెలుకుల, పెరిక, అగ్నికుల క్షత్రియ, అయ్యారక కార్పొరేషన్‌లకు చైర్మన్‌ పదవులు కేటాయించారు. 



జిల్లాలో ఇవీ పదవులు 


జిల్లాలో రాజమహేంద్రవరానికి చెందిన సంకిస భవానీ ప్రియకు తెలుకుల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు. ఈమె ప్రస్తుతం రాజమ హేంద్రవరం నగర వైసీపీ మహిళ విభాగ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో నగరపాలక సంస్థ ఎన్నికల్లో స్థానిక రెండో డివిజన్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. రాజశేఖరరెడ్డి సీఎం హయాం నుంచి ఈమె కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం వైసీపీ ప్రారం భం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 


అలాగే కాకినాడకు చెందిన బందన హరికి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. ఈయన తొలుత కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాల య్యారు. వైసీపీలో చురుకైన కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు.  


సామర్లకోటకు చెందిన ఆవాల రాజేశ్వరి అయ్యారక కార్పొరేషన్‌ చైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు. ఈమె భర్త కాంగ్రెస్‌ పార్టీ తరపున ఒకసారి, వైసీపీ తరపున ఒకసారి పట్టణంలో కౌన్సెలర్‌గా గెలిచారు.  వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌గా కౌన్సిల్‌లో పనిచేశారు. వైసీపీ ప్రారంభం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. పెరిక కార్పొరేషన్‌ చైర్మన్‌గా పురుషోత్తం గంగాభవానికి అవకాశం లభించింది. ఆమె తుని మండలం టి తిమ్మాపురం గ్రామానికి చెందినవారు. ఆమె భర్త స్థానిక వైసీపీ నాయకుడు.

Updated Date - 2020-10-01T08:23:11+05:30 IST