4 లైన్ల రహదారితో పేదల గూడు మాయం!

ABN , First Publish Date - 2022-03-23T03:53:35+05:30 IST

రహదారుల విస్తరణలో భాగంగా కావలి - దుత్తలూరు మధ్యలో నిర్మించనున్న నాలుగు లైన్ల రహదారితో కలిగిరి ప్రాంతంలోని పేదల గూడు కనుమరుగు కానుం ది.

4 లైన్ల రహదారితో పేదల గూడు మాయం!
రోడ్డు విస్తరణలో కనుమరుగుకానున్న తహసీల్దారు కార్యాలయ కూడలి

నీడ కల్పించాలని బాధితుల వేడుకోలు

కలిగిరి, మార్చి 22: రహదారుల విస్తరణలో భాగంగా కావలి - దుత్తలూరు మధ్యలో నిర్మించనున్న నాలుగు లైన్ల రహదారితో కలిగిరి ప్రాంతంలోని పేదల గూడు కనుమరుగు కానుం ది. దీంతో తమకు ప్రత్యామ్నాయంగా ముందుగా నీడ కల్పించాలని బాధితులు వేడుకొంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. దుత్తలూరు సమీపంలోని ఎన్‌హెచ్‌-167 బీజీ నుంచి కావలి సమీపంలోని ఎన్‌హెచ్‌-16ను అనుసంధానం చేస్తూ ఎన్‌హెచ్‌-565 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కావలి-దుత్తలూరు మధ్య ఇప్పుడున్న డబుల్‌ రోడ్డు స్థానంలో కావలి, జలదంకి, కలిగిరి, వింజమూరు, దుత్తలూరు మండలాల మీదుగా 67.404 కిలోమీటర్లు నాలుగు లైన్ల రహదారి నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే కడప-విజయవాడల మధ్య ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. రాబోయే 20 ఏళ్ల నాటి ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని 150 అడుగుల వెడల్పుతో రూ.423.68 కోట్లతో నిర్మించనున్న ఈ రహదారి జలదంకి వద్ద గ్రామంలోకి రాకుండా బైపాస్‌ రోడ్డుగా ఏర్పాటు చేసి కలిగిరి, వింజమూరుల మీదుగా దుత్తలూరు వరకు ప్రస్తుతం ఉన్న పాత రోడ్డునే విస్తరించేలా డిజైన్‌ చేశారు. ఇప్పటికే జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా విద్యుత్‌ స్తంభాలు మార్పు చేయడం, మలుపుల్లో కొలతలు తీస్తున్నారు. దీంతో కలిగిరి పట్టణ వాసులకు మాత్రం కొంతమేరకు ఇబ్బందులు ఎదురవుతోన్నాయి. కలిగిరి పట్టణ శివారు ప్రాంతం నుంచి బైపాస్‌ రోడ్డుకు అవకాశం ఉన్నా పట్టణం మధ్యలో జాతీయ రహదారి వెళ్లేలా  డిజైన్‌ చేయడంతో రోడ్డుకి ఇరువైపుల ఉన్న గృహ, వాణిజ్య భవనాల యజమానుల్లో ఆందోళన మొదలైంది. గతంలో బొల్లినేని వెంకటరామరావు ఎమ్మెల్యేగా ఉన్నపుడు పట్టణంలో కేవలం 60 అడుగుల మేరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు చేశారు. ఈ క్రమంలో భవనాలు నష్టపోయేవారికి పరిహారం ఇవ్వకపోవడంతో కొంతమేర మాత్రమే విస్తరణ పనులు జరిగి మిగిలిన భాగం పనులు ఆగిపోయాయి. అయితే నాడు రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ మార్గం, నేడు జాతీయ రహదారిగా మారడంతో పట్టణంలో 70 నుంచి 90 అడుగుల మేరకు విస్తరణ జరగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కలిగిరి తహసీల్దారు కార్యాలయ కూడలి మలుపు ప్రాంతం కావడం, నాలుగు మార్గాల జంక్షన్‌ కావడంతో ఈ ప్రాంతలో రోడ్డు మధ్య నుంచి 75 అడుగుల మేరకు కొలతలు తీసి ఎర్రజెండాలు పాతారు. తిరిగి రహదారి మధ్య నుంచి మళ్లీ కొలతలు తీసి 45 అడుగుల మేరకు భవనాలను తొలగించాలని మార్కింగ్‌ వేశారు. ఇలా తహసీల్దారు కార్యాలయ కూడలిలో రోజుకో విధంగా మార్కింగ్‌లు వేస్తుండంతో ఇక్కడ రోజువారి కూలి పనులు చేసుకుని జీవనంసాగే పేదలు తాము నివసిస్తున్న నివాస గృ హాలు పూర్తిగా తొలగిపోతే తమ పరిస్థితి ఏమిటని భయాందోళన చెందుతున్నారు. జాతీయ రహదారిగా మార్చనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తమ నివాసాలను తొలగిస్తే ప్రత్యామ్నాయ సౌకర్యం ఏ విధంగా కల్పిస్తారు.. తమకు నష్టపరిహారం ఎంత ఇవ్వనున్నారో తదితర విషయాలపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటి గోడలపై మార్కింగ్‌ వేస్తుండంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించి పూర్తివివరాలతో పట్టణవాసులకు అవగాహన కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Updated Date - 2022-03-23T03:53:35+05:30 IST