దారుణం.. సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ఇద్దరు.. వారిని కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు..

ABN , First Publish Date - 2022-03-02T22:02:44+05:30 IST

సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రపరిచే క్రమంలో కార్మికులు మృత్యువాత పడుతున్న ఘటనలు దేశంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పుణెలో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.

దారుణం.. సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ఇద్దరు.. వారిని కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు..

పూణె: సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రపరిచే క్రమంలో కార్మికులు మృత్యువాత పడుతున్న ఘటనలు దేశంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పుణెలో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. పుణె జిల్లాలోని ఖాల్బోర్ గ్రామంలోగల ఓ భవంతిలో డ్రైనేజీ లైన్‌కు మరమ్మతులు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది. ఈ సందర్భంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచేందుకు అందులోకి దిగిన ఇద్దరు కార్మికులు.. ఊపిరాడకపోవడంతో సాయం కోసం పెద్ద పెట్టున కేకలు వేశారు. 


వారిని రక్షించే క్రమంలో.. కాంట్రాక్టర్ కూడా ట్యాంకులోకి దిగారు. కానీ అతడు కూడా ఊపిరాడక ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. వాళ్ల అరుపులు విన్న మరో వ్యక్తి.. ఆ ముగ్గురిని కాపాడే క్రమంలో ట్యాంకులో పడిపోయాడు. దురదృష్టవశాత్తూ.. ఆ నలుగురు మరణించారు. వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికి తీయించారు. వీటిని ప్రమాదవశాత్తూ సంభవించిన మరణాలుగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Updated Date - 2022-03-02T22:02:44+05:30 IST