Former Union Minister: డీఎంకేకు దూరంగా కేంద్ర మాజీ మంత్రి?

ABN , First Publish Date - 2022-09-20T13:47:35+05:30 IST

డీఎంకే సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుబ్బులక్ష్మి జగదీశన్‌(Former Union Minister Subbulakshmi Jagadeesan) ఆ పార్టీకి

Former Union Minister: డీఎంకేకు దూరంగా కేంద్ర మాజీ మంత్రి?

                              - డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా !


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 19: డీఎంకే సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుబ్బులక్ష్మి జగదీశన్‌(Former Union Minister Subbulakshmi Jagadeesan) ఆ పార్టీకి దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవికి ఆమె రాజీనామా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈరోడ్‌ జిల్లా మొడకుర్చి ప్రాంతానికి చెందిన సుబ్బులక్ష్మి జగదీశన్‌ దివంగత మాజీమంత్రి సర్గుణ పాండ్యన్‌ తర్వాత సుదీర్ఘకాలంగా పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో మొడకుర్చి నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె బీజేపీ అభ్యర్థి సరస్వతి చేతిలో 206 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తన ఓటమికి జిల్లాకు చెందిన ఓ ప్రముఖుడు, తన నియోజకవర్గంలోని ఇద్దరు ప్రాంతీయ కార్యదర్శులు కారణమంటూ సుబ్బలక్ష్మి  పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆమె అసంతృప్తిగా వున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సుబ్బులక్ష్మిపై ఆరోపణలు చేసిన ఇద్దరు ప్రాంతీయ కార్యదర్శులకు సీట్లు కేటాయించారు. అదే సమయంలో పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన తనకు రాజ్యసభ(Rajya Sabha) సభ్యత్వం లభిస్తుందన్న సుబ్బులక్ష్మి ఆశలు కూడా ఫలించలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, గత నెలలో ఈరోడ్‌ జిల్లా కల్లిపట్టిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ, పెరుందురైలో జరిగిన సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు సుబ్బులక్ష్మి పాల్గొన్నారు. అదే సమయంలో సుబ్బులక్ష్మి భర్త జగదీశన్‌ కొంతకాలంలో పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో కథనాలు ప్రచురించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 15న విరుదునగర్‌లో జరిగిన పార్టీ ముప్పెరుం విళాలో సుబ్బులక్ష్మి, ఆమె భర్త జగదీశన్‌ హాజరుకాలేదు. ఈ క్రమంలో, పార్టీ అధిష్ఠానం వైఖరితో మనస్తాపం చెందిన ఆమె పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కొంతమంది సీనియర్లు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆమె అందుబాటులో లేకుండా పోయారని తెలుస్తోంది. 


సుబ్బులక్ష్మి రాజకీయ ప్రస్థానం...

కొడుముడి పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసిన సుబ్బులక్ష్మి(Subbulakshmi) దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ ద్వారా 1977లో రాజకీయాల్లో ప్రవేశించి, మొడకుర్చి నియోజకవర్గంలో పోటీచేసి గెలుపొందారు. ఎంజీఆర్‌ ప్రభుత్వంలో 1978 నుంచి 1980 వరకు చేనేత శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో అన్నాడీఎంకే నుండి వైదొలిగి డీఎంకేలో చేరిన ఆమె.. 1984లో ఈరోడ్‌ నియోజకవర్గంలో పోటీచేసి ఓటమి చవిచూశారు. అనంతరం 1989 ఎన్నికల్లో ఈరోడ్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆమె కరుణానిధి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో వెల్లంకోయిల్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1993లో పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసినా ఆమెకు పరాజయం తప్పలేదు. 1996లో మొడకుర్చి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అలాగే, 2001లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. 2004 పార్లమెంటు ఎన్నికల్లో తిరుచెంగోడు నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించి, మన్మోహన్‌సింగ్‌ మంత్రి వర్గంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

Updated Date - 2022-09-20T13:47:35+05:30 IST