తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే అనసూయమ్మ మృతి

ABN , First Publish Date - 2022-02-11T07:42:56+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధురాలు, తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే టీఎన్‌ అనసూయమ్మ(98) మృతిచెందారు.

తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే అనసూయమ్మ మృతి
అనసూయమ్మ(ఫైల్‌ఫొటో)

మదనపల్లె, ఫిబ్రవరి 10: స్వాతంత్య్ర సమరయోధురాలు, తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే టీఎన్‌ అనసూయమ్మ(98) మృతిచెందారు. వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులోని తన నివాసంలో గురువారం ఉదయం కన్నుమూశారు. ఈమె నెల్లూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ వ్యాపారవేత్త తిక్కవరపు రామిరెడ్డి కుమార్తె. ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరు,  ఇంటర్‌, డిగ్రీ మద్రా్‌సలో పూర్తిచేశారు. కళాశాలలో చదువుకునే రోజుల్లో స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. తన చెల్లెలు టీఎన్‌ శంకుంతలమ్మతో కలిసి మూడునెలలు వేలూరులో జైలుశిక్ష అనుభవించారు. తంబళ్లపల్లెకు చెందిన టీఎన్‌ రఘునాథరెడ్డితో 1944 ఫిబ్రవరి 28న ఈమె వివాహమైంది. 1967 నుంచి 1977 వరకు తంబళ్లపల్లె నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, రఘునాథరెడ్డి పారిశ్రామిక వేత్తతోపాటు ట్రావెల్‌ ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్‌ కూడా. అనంతరం ఏపీ తెలుగుభాషా కమిషన్‌ చైర్మన్‌గాను, ఎస్వీ యూ సెనెట్‌ మెంబర్‌గా,  బీటీ కళాశాల కరస్పాండెంట్‌, బిసెంట్‌ ట్రస్టీ చైర్మన్‌గాను పనిచేశారు. 2008లో టీఎన్‌ రఘునాథరెడ్డి మృతితో వీరి కుటుంబం మదనపల్లె నుంచి బెంగళూరుకు వెళ్లింది. వీరి కుమారుడు టీఎన్‌ హర్షవర్ధన్‌రెడ్డి (మానసిక వైద్య నిపుణుడు), కుమార్తెలు టీఎన్‌ లాలస (వైద్యురాలు), టీఎన్‌ లినథా (కెమిస్ట్రీ లెక్చరర్‌) అమెరికాలోను.. టీఎన్‌ లాసికారెడ్డి బెంగళూరులో అమ్మ వద్ద ఉంటున్నారు. కాగా, ఒమైక్రాన్‌ నేపథ్యంలో ఈమె కుమారుడు, ఇద్దరు కుమార్తెలు అమెరికా నుంచి రాలేకపోయారు. దీంతో అనసూయమ్మ చెల్లెలు కుమారుడు టీఎన్‌ జయనారాయణరెడ్డి.. బెంగళూరులోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3గంటలకు అంత్యక్రియలు పూర్తిచేశారు.

Updated Date - 2022-02-11T07:42:56+05:30 IST