మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి మృతి

ABN , First Publish Date - 2021-04-24T05:15:03+05:30 IST

హుజూరాబాద్‌ మాజీ శాసనసభ్యుడు కేతిరి సాయిరెడ్డి (78) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్‌ తార్నాకలోని ఆయన నివాసంలో మృతి చెందారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి మృతి
కేతిరి సాయిరెడ్డి (ఫైల్‌)


 నివాళులర్పించిన మంత్రి ఈటల

 జూపాకలో నేడు అంత్యక్రియలు


హుజూరాబాద్‌, ఏప్రిల్‌ 23: హుజూరాబాద్‌ మాజీ శాసనసభ్యుడు కేతిరి సాయిరెడ్డి (78) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్‌ తార్నాకలోని ఆయన నివాసంలో మృతి చెందారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ఆయన అహర్నిషలు కృషి చేశారు. ఈయన మృతితో జిల్లాలోని కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ శ్రేణులు దిగ్ర్బాంతి వ్యక్తంచేశారు. ఈయన అంత్యక్రియలు శనివారం జూపాకలో జరగనున్నాయి.


కుటుంబ నేపథ్యం-విద్యాభాస్యం


మండలంలోని జూపాకలో కేతిరి నర్సింహారెడ్డి-మాణిక్యమ్మలకు 1943జనవరి 15న  సాయిరెడ్డి జన్మించారు. కేతిరి రాజాపాపిరెడ్డి-కాంతామ్మ దంపతులు సాయిరెడ్డిని దత్త పుత్రుడిగా సాదుకున్నారు. చెల్పూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం హెచ్‌ఎస్‌సీ, డిగ్రీ హన్మకొండలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పోల్టికల్‌ సైన్స్‌ పూర్తి చేశారు. వరంగల్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో యూడీసీగా పనిచేశారు. ఉన్నత చదువుల కోసం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి హైద్రాబాద్‌లో ఏజీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ ఓయూలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఎల్‌ఎల్‌బీ పూర్తయిన వెంటనే రిజర్వ్‌ బ్యాంకులో ఉద్యోగం వచ్చిన్పటికి చేరకుండ 1967లో హుజూరాబాద్‌లో న్యాయవాదిగా ప్రస్తానం మొదలు పెట్టారు. భార్య కేతిరి పుష్పమాల, కుమారులు రాజాప్రతాప్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కుమార్తె చైతన్యరెడ్డిలు ఉన్నారు.


రాజకీయ ప్రస్థానం


హుజూరాబాద్‌లో 1967లో న్యాయవాది వృత్తిని ప్రారంభించగా తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజా సమితిలో చేరాడు. ఉద్యమంలో చురుకుగా పాల్గొని వరంగల్‌ సెంట్రల్‌ జైల్‌లో ఆరు నెలలు జైలు జీవితం గడిపారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై పెట్టిన కేసులను సాయిరెడ్డి వాదించేవారు. 1972లో జూపాక సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1974లో హుజూరాబాద్‌ సమితి అధ్యక్షుడిగా, 1982లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. 1989లో స్వాతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి హుజూరాబాద్‌ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1994లో కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ముద్దసాని దామోదర్‌రెడ్డిపై, 1999లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇనుగాల పెద్దిరెడ్డి మీద ఓటమి పాలయ్యారు. 2004లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కెప్టెన్‌ లక్ష్మికాంతారావు గెలుపు కోసం పనిచేశారు. 2009నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ 2018లో హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌-శాలపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.


నివాళులర్పించిన మంత్రి ఈటల


కేతిరి సాయిరెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం తెలుసుకున్న మంత్రి ఈటల వెంటనే హైద్రాబాద్‌లోని ఆయన గృహానికి వెళ్లి  మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాయిరెడ్డి మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు.


 ప్రముఖుల నివాళులు


సాయిరెడ్డి మృతి వార్త తెలుసుకొని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మికాంతారావు, మాజీ మంత్రులు ఇనుగాల పెద్దిరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డిలు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ జేఏసీ నాయకులతో పాటు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-24T05:15:03+05:30 IST