గిరిజనులను మోసగిస్తోన్న వైసీపీ

ABN , First Publish Date - 2020-08-10T10:11:12+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులు పూర్తిగా మోసపోయారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

గిరిజనులను మోసగిస్తోన్న వైసీపీ

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు


గుంటూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులు పూర్తిగా మోసపోయారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకుని  టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎం ధారునాయక్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్‌ చిత్రపటం, ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆనందబాబు మాట్లాడుతూ గిరిజనులు నాగరికతకు దూరంగా ఉండటాన్ని గమనించిన ఎన్టీఆర్‌   అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు వాటిని కొనసాగించారన్నారు.


45 ఏళ్లకే పింఛన్లు, గిరిజన పుత్రిక పథకం తదితరాలను టీడీపీ హయాంలో అమలు చేస్తే.. నేడు అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని రద్దు చేసిందని తెలిపారు. విదేశీ విద్యా పథకాన్ని నీరు కార్చారని మండిపడ్డారు. ధారునాయక్‌ మాట్లాడుతూ తొలుత ఆగస్టు 9న ఇస్తానన్న ఆర్‌వోఎఫ్‌ఆర్‌ 9 (ఆడవి హక్కులచట్టం) పాస్‌ పుస్తకాలను అక్టోబరు 2 ఇస్తామని చెప్పడం మాట తప్పటమేనన్నారు. అందునా వాటిని గిరిజనలకు కాకుండా వైసీపీ లబ్ధిదారులకు అందజేయనున్నారని   ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు పురుషోత్తమ్‌నాయక్‌, జమ్మిగుంపుల మాధవరావు, అంజినాయక్‌, చిన్నానాయక్‌, జీమ్లానాయక్‌, కుమార్‌ నాయక్‌ తదితరలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-10T10:11:12+05:30 IST