మాజీ మంత్రి కాలవ అరెస్టు

ABN , First Publish Date - 2022-05-22T06:50:03+05:30 IST

రాయదుర్గం వెంకటరమణ స్వామి కల్యాణమహోత్సవంలో జరిగిన తప్పిదాన్ని నిరూపించేందుకు వెళుతున్న టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులును పోలీసులు అడ్డుకున్నారు.

మాజీ మంత్రి కాలవ అరెస్టు
వడ్డుపల్లి వద్ద కాలవ శ్రీనివాసులును అడ్డుకొని అరెస్టు చేస్తున్న పోలీసులు

రాయదుర్గానికి వెళ్లనీకుండా అడ్డగింత

వడ్డుపల్లి వద్ద టీడీపీ ఆందోళన.. ఉద్రిక్తత

ఆత్మకూరు మే 21: రాయదుర్గం వెంకటరమణ స్వామి కల్యాణమహోత్సవంలో జరిగిన తప్పిదాన్ని నిరూపించేందుకు వెళుతున్న టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొన్ని గంటలపాటు ఉద్రిక్తత కొనసాగింది. టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డి కోసం స్వామివారి కల్యాణాన్ని జాప్యంగా నిర్వహించారని కాలవ ఆరోపించారు. దీన్ని నిరూపించాలని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. దీన్ని స్వీకరించిన కాలవ, ఆధారాలతో బయటపెట్టేందుకు శనివారం రాయదుర్గానికి బయలుదేరారు. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి టోల్‌ గేట్‌ వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.  నోటీసు ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని పోలీసులను కాలవ ప్రశ్నించారు. రెండు గంటలపాటు ఆయన రోడ్డుపైనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు వడ్డుపల్లి వద్దకు చేరుకొని ధర్నా చేశారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో కాలవ శ్రీనివాసులును బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. అనంతపురానికి తరలించేందుకు ప్రయత్నించడంతో నాయకులు, కార్యకర్తలు పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో భారీగా తోపులాట జరిగింది. కార్యకర్తలను పక్కకు లాగేసి కాలవ శ్రీనివాసులును అనంతపురం వైపు తీసుకువెళ్లారు. కురుకుంట వద్దకు పోలీసు వాహనం చేరగానే, అనంతపురం నుంచి అక్కడికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుగా కూర్చొని నిరసన తెలిపారు. అక్కడ మరో అరగంట ఉద్రిక్తత కొనసాగింది. తోపులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పుతోందని భావించి, కాలవ శ్రీనివాసులును పోలీసు స్టేషనకు తీసుకువెళ్లకుండా అనంతపురంలోని ఆయన నివాసానికి తరలించి, హౌస్‌ అరెస్టు చేశారు. మాజీ డిప్యూటీ మేయర్‌ గంపన్న, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఆదినారాయణ, దేవళ్ల మురళి, బుగ్గయ్య చౌదరి, జకీవుల్లా, కళ్యాణదుర్గం నాయకులు ఉన్నం మారుతీ, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధులు సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌, ఉపాధ్యక్షుడు డిష్‌ నాగరాజు, రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన ప్రకా్‌షనాయుడు, నాయకులు గడుపూటి నారాయణస్వామి, వెంకటప్ప, లింగారెడ్డి, రాయల్‌ మురళీ మోహన,  గోపాల్‌ గౌడ్‌, గంజి  నాగరాజు, సరిపూటి శ్రీకాంత, క్రిష్ణకుమార్‌ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. 






Updated Date - 2022-05-22T06:50:03+05:30 IST