Former Chief Minister: ఆయనతో దోస్తీనా..

ABN , First Publish Date - 2022-08-26T13:19:44+05:30 IST

పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam)తో కలిసి పనిచేయలేమంటూ

Former Chief Minister: ఆయనతో దోస్తీనా..

- కలిసి పనిచేసే ప్రసక్తే లేదు: ఎడప్పాడి

- సింగిల్‌ జడ్జి తీర్పుతో స్తంభించిన పార్టీ వ్యవహారాలు

- హైకోర్టులో ఈపీఎస్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

- తీర్పు వాయిదా


చెన్నై, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam)తో కలిసి పనిచేయలేమంటూ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) హైకోర్టుకు స్పష్టం చేశారు. జూలై 11న నిర్వహించిన సర్వసభ్యమండలి సమావేశం చెల్లదని, పార్టీలో గతంలా జంట నాయకత్వమే కొనసాగాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈపీఎస్‌ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌పై గురువారం ఉదయం తుది విచారణ జరిగింది. న్యాయమూర్తులు ఎం.దురైసామి, సుందర్‌మోహన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ విచారణ జరిగింది. సర్వసభ్యమండలిలో తొంభైశాతానికి పైగా సభ్యుల మద్దతు ఉన్నందువల్లే ఆ మండలి సమావేశాన్ని జరిపామని, ప్రజాస్వామ్యబద్ధంగానే నిర్ణయాలు తీసుకున్నారని ఈపీఎస్‌(EPS) తరఫున సీనియర్‌ న్యాయవాదులు విజయ్‌నారాయణన్‌, సీఎస్‌ వైద్యనాధన్‌, అరిమా సుందరం, నర్పదాసంబల్‌ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. సర్వసభ్యమండలి మెజారిటీ సభ్యుల ఏకాభిప్రాయానికి వ్యతిరేకంగా సింగిల్‌ జడ్జి ఉత్తర్వులిచ్చారని ఆరోపించారు. సర్వసభ్యమండలిలోని 2500 మంది సభ్యులు 1.50కోట్ల మంది కార్యకర్తల అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేయగలరని సింగిల్‌ జడ్జి చేసిన వ్యాఖ్యలు కూడా న్యాయసమ్మతంగా లేవన్నారు. సింగిల్‌ జడ్జి  తీర్పుతో పార్టీ వ్యవహారాలు పూర్తిగా స్తంభించాయన్నారు. పిటిషనర్‌ (ఓపీఎస్‌) జూన్‌ 23కు ముందున్న పరిస్థితులే కావాలంటూ స్టేట్‌సకో కోరకపోయినప్పటికీ సింగిల్‌ జడ్జి జంట నాయకత్వానికి మద్దతుగా తీర్పునిచ్చారన్నారు. పార్టీకి సంబంధించినంతవరకూ సర్వసభ్యమండలి సమావేశానికే అత్యున్నతమైన అధికారం ఉందని, ఆ మండలి తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనని స్పష్టం చేశారు. ఓపీఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గురుకృష్ణకుమార్‌, అరవింద్‌ పాండ్యన్‌ తదితరులు హాజరై వాదనలు వినిపించారు. ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదులు గంటసేపు వాదనలు వినిపించాలన్న ధర్మాసనం ఆదేశాల మేరకు ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి. అనంతరం ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. 

Updated Date - 2022-08-26T13:19:44+05:30 IST