రక్షణ కోసం ఢిల్లీ విడిచి వెళ్లిన Naveen Jindal కుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2022-06-11T21:51:50+05:30 IST

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో బెదరింపుల కారణంగా బీజేపీ బహిష్కృత నేత...

రక్షణ కోసం ఢిల్లీ విడిచి వెళ్లిన Naveen Jindal కుటుంబ సభ్యులు

 న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో బెదరింపుల కారణంగా బీజేపీ బహిష్కృత నేత నవీన్ జిందాల్ (Naveen jindal) కుటుంబ సభ్యులు ఢిల్లీ విడిచిపెట్టారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నూపర్ శర్మ వ్యాఖ్యలకు నవీన్ జిందాల్ మద్దతుగా నిలబడటంతో ఆ ఇద్దరిపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. కాగా, తన కుటుంబ సభ్యులు ఢిల్లీ విడిచి వెళ్లిన విషయాన్ని జిందాల్ ధ్రువీకరించారు. ''నేను ఇప్పటికీ ఢిల్లీలోనే ఉన్నాను. భయం కారణంగా నా కుటుంబ సభ్యులు సిటీ విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీనిని వలస (Exodus) గానే చెప్పాలి'' అని జిందాల్ తెలిపారు.


కొందరని కలుసుకునేందుకు ఇటీవల తాను బయటకు వెళ్లినప్పుడు అజ్ఞాత వ్యక్తులు తనను అనుసరించారని జిందాల్ ఆరోపించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిందాల్ ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ చేసినట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కాగా, శర్మ, జిందాల్ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారంనాడు దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. శనివారం సాయంత్రం లక్ష్మీనగర్ చౌక్‌లో నిరసనలకు కూడా కొందరు పిలుపునిచ్చారు. దీంతో శర్మ, జిందాల్‌కు మద్దతుగా తాము నిరసనలు తీస్తామని అఖండ్ భారత్ మోర్చా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోర్చా ఆర్గనైజర్ సందీప్ అహుజాను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.

Updated Date - 2022-06-11T21:51:50+05:30 IST