‘పట్టణ ప్రగతి’కి కసరత్తు

ABN , First Publish Date - 2020-02-20T10:13:57+05:30 IST

‘పల్లె ప్రగతి’తో గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం తాజాగా పట్టణాల అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది.

‘పట్టణ ప్రగతి’కి కసరత్తు

24నుంచి 4వరకు ప్రత్యేక కార్యాచరణ

క్షేత్రస్థాయిలో అభివృద్ధి కమిటీలు

నేడు కొత్తగూడెంలో అవగాహన సదస్సు

హాజరుకానున్న మంత్రి పువ్వాడ, ప్రజాప్రతినిధులు

  

 (ఆంద్రజ్యోతి, కొత్తగూడెం): ‘పల్లె ప్రగతి’తో గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం తాజాగా పట్టణాల అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన కార్యచరణను చేపట్టారు. ఈ క్రమంలోనే 24తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నేపధ్యంలో గురువారం కొత్తగూడెం క్లబ్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి ఆధ్వర్యంలో అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌ అధికారులు, సంబంధిత శాఖాధికారులు హాజరు కానున్నారు. 


‘పల్లెప్రగతి’ స్పూర్తితో..

పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లే పట్టణ ప్రగతిని కొనసాగించాలనే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో నాలుగు మునిసిపాలిటీలతో పట్టణాలు విస్తరించి ఉన్నాయి. కొత్తగూడెం మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 144 వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో 2,160 మంది సభ్యులను నియమించారు.  పాల్వంచ మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 24వార్డులు ఉండగా, 96వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో 1,440 మంది సభ్యులు ఉన్నారు. ఇల్లెందు మునిసిపాలిటీ పరిధిలో 24 వార్డులు ఉండగా, మొత్తం వార్డు కమిటీలు 96 కాగా, సభ్యులు 1,440 మంది ఉన్నారు. మణుగూరు మునిసిపాలిటీ పరిధిలో 24 వార్డులు ఉండగా, వార్డు కమిటీలు 96కాగా, 1,440 మంది సభ్యులుగా నియమించారు. ఈ మేరకు ఆయా మునిసిపాలిటీల కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా కలెక్టర్‌ సైతం క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన సమాచారంపై ప్రత్యేక నోడల్‌ అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. 


 వార్డుస్థాయిలో కమిటీలు..

పట్టణాల అభివృద్ధికోసం ప్రతివార్డులో క్షేత్రస్థాయిలో వార్డు కమిటీల ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కో వార్డులో నాలుగు కమిటీను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి యువజనుల కమిటీ, రెండు మహిళల కమిటీ, మూడు వయోజనుల కమిటీ, నాలుగు ఇతర ప్రముఖుల కమిటీ విడివిడిగా ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులను నియమించనున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న మునిసిపాలిటీలలో కౌన్సిలర్‌లను కలుపుకొని ప్రతి పట్టణానికి కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, వార్షిక పంచవర్ష ప్రణాళిక తయారు చేయాల్సి ఉంటుంది. ప్రతి వార్డుకు శాశ్వత ప్రాతిపదికన ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ నియమించనున్నారు. 


పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యం..

ఆయా కమిటీల ద్వారా పట్టణాల పరిశుభ్రతకు కృషి చేయనున్నారు. ప్రతిరోజు చెత్తను సేకరించి రోడ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రమైన తాగునీరు కూడా సరఫరా చేయాల్సి ఉంటుంది. వీధి లైట్ల నిర్వహణకు చర్యలు చేపట్టాలి. రహదారులపై గుంతలు, గోతులు ఉండకూడదు. పట్టణమంతా పచ్చదనంతో నిండి ఉండాలి. పారిశుధ్య నిర్వహణ, చెత్తను నిర్మూలించేందుకు ఆయా మునిసిపాలిటీ పరిధిలో డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా అనేక విషయాల్లో పట్టణ పాలనను గాడిలో పెట్టే కార్యక్రమం చేపట్టనున్నారు. వీధుల్లో వ్యాపారం చేసుకునే స్ట్రీట్‌ వెండర్స్‌ కోసం అన్ని పట్టణాల్లో స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పట్టణాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ కొంత లోపభూయిష్టంగా ఉందని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు బడ్జెట్‌లో కేటాయించేందుకు సిద్ధమైంది. ఎనిమిది నెలల్లోపు విద్యుత్‌ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఆ సమస్యల పరిష్కారానికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.


మునిసిపాలిటీ పరిధిలో చెత్త తరలించేందుకు కొత్త వాహనాలను సైతం సమకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాలకు ప్రతి నెల ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తుంది. వాటితో పాటు ఇతర ఖర్చులను తగ్గించుకొని రాష్ట్ర ప్రభుత్వం  పట్టణాభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధపడుతోంది. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబంధిత అభివృద్ధి నిధులను కూడా పట్టణ ప్రగతికి వినియోగించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. జీవో 58, 59 ద్వారా గతంలో పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను సైతం క్రమబద్ధీకరించేందుకు అన్నీ మునిసిపాలిటీల్లో మరోసారి అవకాశమిచ్చేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ కార్యక్రమాల  నిర్వహణకు ఇప్పటికే కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు మునిసిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా ప్రత్యేక పట్టణ ప్రగతి అధికారులను నియమించారు. ఇక ఆయా మునిసిపాలిటీల పరిధిలో వార్డు కమిటీల నియామకం చేపట్టి ప్రకటించాల్సి ఉంటుంది. ఒక్కో కమిటీకి 15 మంది సభ్యులను నియమించనున్నారు. 


Updated Date - 2020-02-20T10:13:57+05:30 IST