Abn logo
Oct 28 2021 @ 01:06AM

దారికోసం.. అధికార పార్టీలో వర్గపోరు

కార్పొరేషన్‌ స్థలంలోని ఆక్రమణలను తొలగిస్తున్న సిబ్బంది

తిరుపతిలో ముదురుతున్న డీబీఆర్‌- కొర్లగుంట రోడ్డు వివాదం


తిరుపతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలోని కొర్లగుంట నుంచి డీబీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుకు అనుసంధానం చేసే రెండు దారుల కోసం అధికార పార్టీలో వర్గపోరు భగ్గుమంది. నెలరోజులుగా చాపకింద నీరులా సాగుతున్న ఈ వివాదం బుధవారం మరింత ముదిరింది. అధికార పార్టీలో రాజకీయంగా అంతర్గత చిచ్చుకు తెరలేపింది. డీబీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు ఏర్పాటు కాగానే కొర్లగుంట మారుతీనగర్‌లోని మూడు వీధులకు అనుసంధానం చేయమని కార్పొరేషన్‌ కోఆప్షన్‌ సభ్యురాలు శ్రీదేవి నేతృత్వంలో స్థానికులు డిప్యూటీ మేయర్‌ అభినయ్‌ రెడ్డిని, కమిషనరు గిరీషను కోరారు. కాలువ పొరంబోకు స్థలం ఉండటంతో లింకు రోడ్లకు ఎలాంటి ఇబ్బంది లేదన్న భావనతో ఆ దిశగా రోడ్ల వసతి కల్పించాలని భావించారు. ఈ రోడ్ల అనుసంధానంతో మారుతీనగర్‌లోని వేలాది కుటుంబాలకు ప్రయాణం సౌలభ్యంగా ఉంటుందనుకున్నారు. దీనికోసం సర్వే చేయించగా కార్పొరేషన్‌ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని తాత్కాలిక షెడ్లు వేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని తొలగించే క్రమంలో మేయర్‌ వర్గం నుంచి ఒత్తిడి రావడంతో.. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అప్పట్లో పాక్షికంగా తీసి వెనుదిరిగారు. దీనిని గమనించిన స్థానికులు పట్టువదలకుండా కమిషనరుపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో కో ఆప్షన్‌ సభ్యురాలు లింకు రోడ్ల విషయాన్ని ప్రస్తావించారు. టేబుల్‌ అజెండా కింద పెట్టి తీర్మానం చేయాలని మేయరును కమిషనరు కోరగా, ఆమె అంగీకరించలేదు. తర్వాత జరిగే కౌన్సిల్‌ అజెండాలో పెడతామని కోఆప్షన్‌ సభ్యురాలికి కమిషనరు సర్దిచెప్పారు. ఎంతకీ ఆక్రమణలు తొలగించకపోవడంతో రెండు రోజుల కిందట జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలోనూ స్థానికులు కలిసి లింకు రోడ్లు త్వరగా వేయాలని గిరీషకు వినతిపత్రం అందించారు. దీంతో కమిషనర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆక్రమణలు తొలగించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీశారు. అదే రోజు సాయంత్రం లోపు తీసేస్తామని అధికారులు కమిషనరుకు చెప్పి వచ్చేశారు. కానీ, బుధవారం వరకు కూడా ఆక్రమణలను తొలగించకపోవడంతో కోఆప్షన్‌ సభ్యురాలు మళ్లీ కమిషనర్‌ను కలిశారు. దీంతో ఆయన ఆగ్రహంతో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బందిని పిలిపించి వెంటనే సస్పెండ్‌ చేయండంటూ ఏడీసీ హరితకు సూచించారు. ‘రాజకీయ వ్యవహారాలు ఏదైనా ఉంటే మీరుమీరు చూసుకోవాలే గానీ నా ఆదేశాలను లెక్కచేయకపోతే ఇక నేను ఎందుకు ఇక్కడ?’ అంటూ అక్కడే ఉన్న అధికార పార్టీకి చెందిన ఓ కీలక కార్పొరేటర్‌ను ఉద్దేశించి కమిషనర్‌ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. సస్పెండ్‌ చేస్తారేమోనన్న భయంతో అధికారులు ఘటనాస్థలికి పరుగులు తీసి ఆక్రమణలు తొలగించారు. ఈ క్రమంలో స్థానికులపై ఆక్రమణదారులు రుసరుసలాడినట్టు తెలుస్తోంది.స్థానికుల ఇళ్లను ఫొటోలు తీయడం, అందరికీ కోర్టునుంచి నోటీసులు పంపుతామని బెదిరించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆక్రమణలైతే తీశారుగానీ రోడ్డు వేయడమే ఇప్పుడు కమిషనరుకు సవాలుగా మారనుంది.