అగ్నివీరులకు కార్పొరేటు దిగ్గజాల భరోసా.. Anand Mahindra బాటలో Harsh Goenka

ABN , First Publish Date - 2022-06-20T22:12:03+05:30 IST

మిలిటరీ నియామక స్కీమ్ ‘అగ్నిపథ్ఏ(Agnipath)’పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు, తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న వేళ పలువురు దేశీయ

అగ్నివీరులకు కార్పొరేటు దిగ్గజాల భరోసా.. Anand Mahindra బాటలో Harsh Goenka

న్యూఢిల్లీ : మిలిటరీ నియామక స్కీమ్ ‘అగ్నిపథ్(Agnipath)’పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు, తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న వేళ పలువురు  దేశీయ కార్పొరేటు దిగ్గజాలు స్పందిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. అగ్నివీరులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశం కల్పిస్తామంటూ ప్రకటన చేసిన మహింద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్రా(Anad mahindra) సరసన మరో కార్పొరేటు దిగ్గజం, ఆర్‌పీజీ గ్రూప్(RPG group) చైర్మన్ హర్ష గోయెంకా(Harsha Goenka) కూడా చేరారు. ఆనంద్ మహింద్రా  ట్వీట్‌ను జతచేస్తూ..  అగ్నివీరుల నియామకానికి ఆర్‌పీజీ గ్రూపు ఉపాధి అవకాశాలు కూడా స్వాగతం పలుకుతాయని హర్ష గోయెంకా భరోసా కల్పించారు. ఇతర కార్పొరేట్లు కూడా తమలాగే ప్రతిజ్ఞ చేస్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ‘‘ మన యువత భవితకు భరోసా కల్పిద్దాం’’ అని హర్ష గోయెంకా వ్యాఖ్యానించారు.


కాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆర్మీ అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. దేశంలోని పలుచోట్ల రైళ్లు, బస్సులను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో మహింద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్రా గురువారం ఉదయం ట్వీటర్ వేదికగా స్పందించారు. ‘‘ అగ్నిపథ్ పథకం కేంద్రకంగా కొనసాగుతున్న హింసపట్ల విచారిస్తున్నాను. ఈ స్కీమ్ చివరి ఏడాదికి చేరుకున్నాక అగ్నివీరుల క్రమశిక్షణ, నైపుణ్యాలు వారికి అపార ఉపాధి అవకాశాలను తెచ్చిపెడతాయి. అలాంటి సుశిక్షిత, సామర్థ్యం కలిగిన యువతకు మహింద్రా గ్రూప్ ఉపాధి అవకాశాలు కూడా స్వాగతం పలుకుతాయి’’ అని ఆనంద్ మహింద్రా హామీ ఇచ్చారు. దీంతో ప్రత్యక్షంగా అగ్నిపథ్ పథకాన్ని స్వాగతించినట్టయింది.

Updated Date - 2022-06-20T22:12:03+05:30 IST