HYD : ఫుట్‌పాత్‌లపై ఏంటిది.. పాదచారులకు దారేది..!?

ABN , First Publish Date - 2022-02-22T19:37:14+05:30 IST

ప్రధాన రహదారులపై ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా నడకదారి కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో

HYD : ఫుట్‌పాత్‌లపై ఏంటిది.. పాదచారులకు దారేది..!?

  • ఫుట్‌పాత్‌లపై వీధి వ్యాపారులు
  • రోడ్డు ప్రమాదాల బారిన వాహనదారులు

హైదరాబాద్ సిటీ/మల్కాజిగిరి : ప్రధాన రహదారులపై ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా నడకదారి కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు వీధివ్యాపారులకు వరంగా మారాయి. మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలోని ఫుట్‌పాత్‌లపై వీధి వ్యాపారులు తిష్ఠ వేయడంతో పాదచారులకు దారి లేకుండా పోతోంది.  మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలోని ఆరు వార్డులలో 4.8 కిలోమీటర్ల దూరంలో రూ. 1.5 కోట్లతో ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. ఏ ప్రయోజనాలకోసమైతే రూ. కోట్లు వెచ్చించి  ఫుట్‌పాత్‌లు నిర్మాణం జరిపారో.. ఆ ప్రయోజనాలు మాత్రం నెరవేరకపోగా తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రావినిపిస్తున్నాయి. ఇటీవల మల్కాజిగిరి, ఆర్‌కేనగర్‌, ఆనంద్‌బాగ్‌, మినీట్యాంక్‌బండ్‌, మౌలాలి, నేరేడ్‌మెట్‌, వాయుపురి, సైనిక్‌పురి తదితర ప్రాంతాల్లో వేసిన ఫుట్‌పాత్‌లను కబ్జా చేసి చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దుకాణాల ముందు ఫుట్‌పాత్‌లపై వివిధ రకాల సామగ్రి నింపేస్తున్నారు. 


ముఖ్యంగా మల్కాజిగిరి చౌరస్తాలోని రోడ్డుకు రెండు వైపులా పూలు, పండ్లు, పూజాసామగ్రి లాంటి షాపులను ఏర్పాటుచేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. సఫిల్‌గూడలో మాస్క్‌లు, ఉల్లిపాయలు, పుదీనా జ్యూస్‌, పండ్లు తదితర చిరువ్యాపారులతో నిండిపోయి రద్దీగా కన్పిస్తున్నాయి. దీంతో పాదచారులు రహదారులు పైకి రావాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇవే ప్రాంతాల్లో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటు ట్రాఫిక్‌ పోలీసులు గాని, అటు జీహెచ్‌ఎంసీ అధికారులు కాని పట్టించుకోక పోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాపుల ముందు ఆయా షాపుల బోర్డులు ఏర్పాటు చేస్తేనే వారిపై వేల రూపాయల చలాన్లు విధిస్తున్న జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ బృందంగాని,  ట్రాఫిక్‌ పోలీసులకు గాని ఈ ఫుట్‌పాత్‌ ఆక్రమణలు కన్పించడం లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఫుట్‌పాత్‌ ఆక్రమణలు తొలగించి ఫుట్‌పాత్‌ వ్యాపారులకు వ్యాపారాలు చేసుకునేందుకు మరోచోట వారికి ఉపాది కల్పించాల్సిన అవసరం అధికారులపై ఎంతైనా ఉంది.

Updated Date - 2022-02-22T19:37:14+05:30 IST