ఆఫ్రికా నుంచి డ్రగ్స్..!

ABN , First Publish Date - 2022-04-21T16:30:23+05:30 IST

ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో మిస్టరీగా మారిన డ్రగ్స్‌ వ్యవహారంపై పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. పబ్‌లో దొరికిన డ్రగ్స్‌ రాష్ట్రంలోకి

ఆఫ్రికా నుంచి డ్రగ్స్..!

ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో కీలక ఆధారాలు

అమ్మారా.. తెచ్చుకున్నారా.. 

రెండు కోణాల్లోనూ దర్యాప్తు

టోనీ కేసులో నిందితులతో పబ్‌ నిర్వాహకులకు సంబంధాలు

హైదరాబాద్/బంజారాహిల్స్‌: ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో మిస్టరీగా మారిన డ్రగ్స్‌ వ్యవహారంపై పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. పబ్‌లో దొరికిన డ్రగ్స్‌ రాష్ట్రంలోకి ఎలా వచ్చాయనే దానిపై దృష్టి సారించారు. పబ్‌లో పోలీసులకు దొరికింది కొకైన్‌ అని ఇప్పటికే తేలింది. ప్యాకింగ్‌ను క్షుణంగా పరిశీలించగా, అది ఆఫ్రికా నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నా రు. ఆఫ్రికానుంచి వచ్చే డ్రగ్స్‌ ప్యాకింగ్‌కు ఓ ప్రత్యేకత ఉంటుందని పబ్‌లో దొరికిన డ్రగ్స్‌కు కూడా ప్యాకింగ్‌ అలాగే ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్‌ ఆఫ్రికా నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చాయా లేదా గోవా, ముంబై నుంచి రవాణా అయ్యాయా అనేది తేలాల్సి ఉంది. అయితే.. పబ్‌లో దొరికిన డ్రగ్స్‌ ఎలా వచ్చాయి అనేదానిపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. అయితే నిర్వాహకులైనా తేవాలి లేదంటే పార్టీకి వచ్చిన వారు ఉపయోగించుకునేందుకు తెచ్చుకొని ఉండాలనే వాదనలు వినిపస్తున్నాయి. ఈ నేపథ్యంలో  రెండు కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలపై కూడా దృష్టి సారించారు. ఇక పోతే పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌, మేనేజర్‌ అనిల్‌ను పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి తీసుకొని ప్రశ్నించడంతో కొన్ని విషయాల్లో స్పష్టత వచ్చింది. డ్రగ్స్‌ పబ్‌లోకి రావడంలో తమ ప్రమేయం లేదని ఇద్దరూ చెప్పారు. దీంతో రూటు మార్చిన పోలీసులు అభిషేక్‌ ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్‌, వాట్సాప్‌ గ్రూప్‌లపై కూపీ లాగారు. 


డ్రగ్‌ పెడలర్స్‌తో పరిచయాలు

అభిషేక్‌ సెల్‌ఫోన్‌లో వంద సంఖ్యలో ఫోన్‌ నంబర్లు ఉన్నాయి. వీటిన్నింటిని పోలీసులు క్షుణంగా పరిశీలించారు. టోనీ వద్ద  లభించిన ఫోన్‌ నంబర్లతో సరిచూసి వెతికారు.  టోనీ కేసులో గతంలో అరెస్టు అయిన నలుగురి ఫోన్‌ నంబర్లు అభిషేక్‌ సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్లతో సరిపోలాయి. ఈ నలుగురి గురించి అభిషేక్‌ను ప్రశ్నించగా, పార్టీలో పరిచయం అయినట్టు చెప్పాడు. వీరిలో గతంలో డ్రగ్స్‌ అమ్మినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాయత్‌నగర్‌కు చెందిన సోమ శశికాంత్‌, జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీకి చెందిన గంధిపల్లి సంజయ్‌లకు ఈ నెల 21న తమ ముందుకు హాజరుకావాలని బంజారాహిల్స్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరిద్దరి ప్రశ్నించిన తరువాత మరో ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. 


బెయిల్‌పై కోర్టులో వాదనలు

కస్టడీ ముగియడంతో అభిషేక్‌, అనిల్‌ నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వారి పాత్ర లేకపోయినా అభిషేక్‌, అనిల్‌లను  పోలీసులు అరెస్టు చేశారని నిందితుల తరఫు న్యాయవాది ఆరోపించారు. కస్టడీ కూడా ముగియడంతో ఇద్దరికి బెయిల్‌ ఇవ్వాలని కోరారు. కానీ, పోలీసులు మాత్రం నిందితుల బెయిల్‌ను వ్యతిరేకించారు. వాదనలు విన్ని కోర్టు బెయిల్‌ పై తుది తీర్పును రిజర్వ్‌ చేసింది. 


డ్రగ్స్‌ తీసుకుంది 15 మంది

కస్టడీలో ఉన్న అభిషేక్‌, అనిల్‌లు మాత్రం పార్టీకి వచ్చిన వారే డ్రగ్స్‌ తెచ్చారంటూ పోలీసులకు చెప్పారు. పోలీసులను చూడగానే పార్టీకి వచ్చిన వారు వాటిని విసిరేయడంతో డెస్క్‌ మీదకు వచ్చి పడ్డాయని తెలిపారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలంగాణ ఐటీ సెల్‌ రూపొందించిన  డోపమ్స్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయం తీసుకొని గతంలో డ్రగ్స్‌ వినియోగించిన వారి జాబితా సిద్ధం చేశారు. పబ్‌పై దాడి చేసిన సమయంలో అక్కడ ఉన్న 152 మందిలో సుమారు 15 పేర్లు డోపమ్స్‌లో కూడా ఉం డటం గమనించారు. ఈ జాబితాను సిద్ధం చేశారు. వీరి వద్ద రక్తనమూనాలు తీసుకుంటే డ్రగ్స్‌ తీసుకున్నది లేనిది నిర్ధారణ అవుతుంది. కానీ, రక్త నమూనాలు ఇవ్వడానికి ఈ 15 మంది అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఈ 15 మందిలో విడతల వారీగా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్దం అవుతున్నారు. అభిషేక్‌, అనిల్‌కు పబ్‌లో దొరికిన డ్రగ్స్‌కు సంబంధం లేకపోయినప్పటికీ పబ్‌లోకి డ్రగ్స్‌ వచ్చేలా చేసినందుకు సెక్షన్‌ 25 , 8సి ఐపీసి కింద మాత్రం శిక్షార్హులవుతారని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-04-21T16:30:23+05:30 IST