ఈ వ్యాధి ఉన్న వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

ABN , First Publish Date - 2020-05-10T17:19:08+05:30 IST

మా అమ్మకు అరవై ఏళ్లు, పార్కిన్సన్స్‌ వ్యాధి ఉంది. చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఆవిడ శాకాహారి. ఎలాంటి ఆహారపు నియమాలు పాటిస్తే బలం వస్తుంది?

ఈ వ్యాధి ఉన్న వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

ఆంధ్రజ్యోతి(10-05-2020):

ప్రశ్న: మా అమ్మకు అరవై ఏళ్లు, పార్కిన్సన్స్‌ వ్యాధి ఉంది. చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఆవిడ శాకాహారి. ఎలాంటి ఆహారపు నియమాలు పాటిస్తే బలం వస్తుంది?


- శశికాంత్‌, విజయవాడ 


డాక్టర్ సమాధానం: పార్కిన్సన్స్‌ ఉన్నవారికి ముఖ్యంగా మలబద్దకం సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే ఆహారంలో పీచుపదార్థాలు, నీళ్లు ఉండేలా చూసుకోవాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్లు చాలా తక్కువగా తీసుకోవాలి. రోజుకు అవసరమైన ప్రొటీన్లను రాత్రి భోజనంలో తీసుకుంటే మంచిది. ఉదయం అల్పాహారంగా అటుకులు లేదా అన్నం, బియ్యం లేదా సగ్గుబియ్యంతో చేసిన పదార్థాలు తీసుకుంటే ప్రొటీన్లకు అవకాశం ఉండదు. పాలు, పెరుగు, మజ్జిగ లాంటివి రాత్రి తీసుకోవాలి. మధ్యాహ్నం ఆకుకూరలు, కాయగూరలు, అన్నంతో తినాలి. పప్పును ఉదయం పూట తీసుకోకపోవడం మంచిది. బీన్స్‌, సోయా లాంటివి తగ్గించడం, లేదా పూర్తిగా మానెయ్యాలి. ఒకవేళ తీసుకున్నా రాత్రి భోజనంలో మాత్రమే తీసుకోవాలి. బాగా బరువు తగ్గిపోతున్నట్టు అయితే వెన్న, నెయ్యి లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. అరటిపండు, మెత్తని ఖర్జూరాలు ఎప్పుడైనా తీసుకోవచ్చు. నీళ్లు తాగడం మర్చిపోయే అవకాశం ఉన్నందున ప్రతి పూట సూప్‌ కానీ రసం కానీ మరిన్ని నీళ్ల కోసం తీసుకోవచ్చు. పళ్లరసాలూ మంచివే.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-05-10T17:19:08+05:30 IST