శాంతిస్తున్న కృష్ణమ్మ

ABN , First Publish Date - 2021-08-04T06:01:37+05:30 IST

కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది.

శాంతిస్తున్న కృష్ణమ్మ

క్రమంగా తగ్గుతున్న వరద

ఇన్‌ ఫ్లో 2.45 లక్షలు..

అవుట్‌ ఫ్లో 2.11 లక్షల క్యూసెక్కులు

కాల్వలకు 9,689 క్యూసెక్కులు


విజయవాడ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కి వస్తున్న వరద తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజ్‌కి మంగళవారం 2లక్షల 45వేల 68 క్యూసెక్కుల నీరు వచ్చింది. పులిచింతల నుంచి 2లక్షల 43వేల 977 క్యూసెక్కులు, పాలేరు నుంచి 136, కీసర నుంచి 955 క్యూసెక్కుల నీరు వస్తోంది. బ్యారేజ్‌ గేట్లలో 30 గేట్లను ఐదు అడుగులు, 40 గేట్లను నాలుగు అడుగుల వరకు ఎత్తారు. వాటి ద్వారా 2లక్షల 11వేల 750 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. గుంటూరు కెనాల్‌తోపాటు జిల్లాలోని కాల్వలకు 9,689 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే నీరు బుధవారం ఉదయానికి మరింత తగ్గొచ్చని భావిస్తున్నారు. 


వరదనీటిలోనే కృష్ణలంక ప్రాంతం

కృష్ణానదిని ఆనుకొని ఉన్న కృష్ణలంకలోని లోతట్టు ప్రాంతాల్లో వరదనీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాణిగారితోట, తారకరామానగర్‌ తదితర ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరదనీరు మరింతగా రావడంతో అక్కడి ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. 


పవిత్ర సంగమ ప్రాంతం జలమయం

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 3 : ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో  ఫెర్రీ, జూపూడి, మూలపాడు, కొటికలపూడి నదీతీర ప్రాంతాల్లో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం ఫెర్రీ వద్ద వరద నీరు భారీగా చేరుకుంది. అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా పుష్కర్‌నగర్‌లోని నివాసాల్లోకి వరద నీరు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పవిత్ర సంగమం వద్ద పార్క్‌లోకి వరద నీరు చేరింది.  



Updated Date - 2021-08-04T06:01:37+05:30 IST