అసలే వరదలు...ఇక్కడి నుండి వెళ్లిపోండి: షిండేపై కాంగ్రెస్ మండిపాటు

ABN , First Publish Date - 2022-06-24T20:36:50+05:30 IST

అసలే వరదలతో అసోం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, శివసేన ఎమ్మెల్యేలు గౌహతిలో క్యాంప్ చేయడం, మీడియా ముందు చేస్తున్న ...

అసలే వరదలు...ఇక్కడి నుండి వెళ్లిపోండి: షిండేపై కాంగ్రెస్ మండిపాటు

గువాహటి: అసలే వరదలతో అసోం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, శివసేన ఎమ్మెల్యేలు గువాహటిలో క్యాంప్ చేయడం, మీడియా ముందు చేస్తున్న హడావిడిపై అసోం కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది రాష్ట్ర ప్రజలకు ఇబ్బందికరంగా మారడంతో పాటు, అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తోందని పేర్కొంది. మహారాష్ట్ర మంత్రి, సేన రెబెల్ నేత ఏక్‌నాథ్ షిండేకి ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా ఒక లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా అసోంను విడిచి వెళ్లాలని ఆ లేఖలో కోరారు.


బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ''రాజకీయ బేరసారాలను ప్రోత్సహించే వీలర్-డీలర్‌''గా మారారంటూ బోరా మండిపడ్డారు. వరద సంక్షోభాన్ని ముందు చక్కబెట్టాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆయన సూచించారు. ''మీరు ఇక్కడే క్యాంప్ చేయడం అవరోధంగా మారుతోంది'' అని రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి బోరా పేర్కొన్నారు. అసోం రాష్ట్రం వరదలతో అతలాకుతలమైందని, సరైన సహాయక చర్యలు లేక ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని బోరా తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి 105 మంది వరదల్లో మృత్యువాతపడ్డారని, 32 జిల్లాల్లోని 55 లక్షల మంది వరదల బారిన పడ్డారని చెప్పారు. ఇలాటి పరిస్థితుల్లో గౌహతిలో మీరు (రెబల్ ఎమ్మెల్యేలు) క్యాంప్ చేయడం, వారికి రాజమర్యాదలు చేయడంలో అసోం ప్రభుత్వం బిజీగా ఉండటం అనుచితమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. 

Updated Date - 2022-06-24T20:36:50+05:30 IST