Abn logo
Dec 2 2020 @ 23:22PM

తగ్గిన వరద... పూడని గండి !

కనుపూరు కాలువపై సూపర్‌ ప్యాసేజ్‌ గోడ స్థానంలో ఏర్పాటు చేసిన ఇసుక బస్తాలు

కనుపూరు కాలువపై సూపర్‌ ప్యాసేజ్‌ పునరుద్ధరణ 

పలు మార్గాల్లో రాకపోకలు పునఃప్రారంభం

కుదుటపడుతున్న నగరం


నెల్లూరు రూరల్‌, డిసెంబరు 2 : 

నివర్‌ తుఫాన్‌ తాకిడికి నెల్లూరు నగరం, రూరల్‌లో స్తంభించిన పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయి. దెబ్బతిన్న రహదారులు, కాలువలకు అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. వరద ఉధృతికి ఛిద్రమైన నెల్లూరు-తాటిపర్తి రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు. పొట్టేపాళెం కలుజు వద్ద వరద ప్రవాహం తగ్గడంతో ఆ మార్గంలో వాహనాలు తిరుగుతున్నాయి. అలాగే జొన్నవాడ మలుపు వద్ద నరసింహకొండకు వెళ్లే రోడ్డు దెబ్బతినగా అధికారులు పునరుద్ధరించారు. కనుపూరు కాలువపై 25వ కి.మీ. వద్ద ఉప్పుటూరుకు వెళ్లే మార్గంలో సూపర్‌ప్యాసేజ్‌ గోడ వరద తీవ్రతకు కూలడంతో చెరువుల్లోని నీరు కనుపూరు కాలువలోకి భారీగా ప్రవహించింది. ఇరిగేషన్‌ ఏఈ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని సిబ్బంది ఇసుక బస్తాలతో తాత్కాలిక గోడను నిర్మించి వరదను కాలువలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో 30వ కి.మీ. సౌత్‌మోపూరు వద్ద కాలువకు పడిన గండిని పూడ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయి. అయితే గండిని ఇంకా పూడ్చలేదు. ప్రస్తుతం గండి నుంచి వరద నీరు రామయ్య చెరువు వైపు ప్రవహిస్తోంది.


తేరుకుంటున్న లోతట్టు ప్రాంతాలు

భారీ వర్షాలు, పెన్నా వరదతో జలమయం అయిన నెల్లూరులోని లోతట్టు ప్రాంతాలు మెల్లగా తేరుకుంటున్నాయి. వరద కారణంగా వందలాది కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. క్రమేణ పెన్నాకు వరద తగ్గడం, వర్షాలు ఆగిపోవడంతో వారు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. దెబ్బతిన్న వనరులను అధికారులు పునరుద్ధరిస్తున్నారు. కార్పొరేషన్‌ సిబ్బంది పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తుండగా, డ్రైన్లు, కల్వర్టుల మరమ్మతులను ఇరిగేషన్‌ అధికారులు చేపట్టారు. నగరంలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది.

Advertisement
Advertisement
Advertisement